Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. సమీప ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు!

తైవాన్‌(Taiwan) ఆగ్నేయ తీరంలో ఆదివారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది. ఇక్కడి చిషాంగ్ పట్టణంలో ఏడు కిలోమీటర్ల లోతులో...

Published : 18 Sep 2022 19:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తైవాన్‌(Taiwan) ఆగ్నేయ తీరంలో ఆదివారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది. ఇక్కడి చిషాంగ్ పట్టణంలో ఏడు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు తైవాన్‌ వాతావరణ విభాగం వెల్లడించింది. శనివారం సైతం అదే ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పటినుంచి ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేటి మధ్యాహ్నం భారీ తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే, క్షతగాత్రుల సంఖ్య తెలియరాలేదు. రాజధాని తైపీ(Taipi)లోనూ ప్రకంపనలు కనిపించాయి. తమ తీర ప్రాంతాల్లోని ఫుజియాన్, గ్వాంగ్‌డాంగ్, జియాంగ్సు, షాంఘైలోనూ ప్రకంపనలు నమోదయ్యాయని చైనా(China) తెలిపింది.

భూకంపం ధాటికి తైవాన్‌లో అనేక భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. కట్టడాలు ఊగిపోయాయి. యూలి పట్టణంలో మూడంతస్తుల భవనం కూలిపోయినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. ఈ పట్టణంలో ఏడువేలకు పైగా ఇళ్లలో విద్యుత్‌, నీటి కనెక్షన్లు దెబ్బతిన్నాయి. ఓ వంతెన కూలిపోయింది. ఆరెంజ్ డే లిల్లీస్‌కు ప్రసిద్ధి చెందిన ఓ పర్వతంపై కొండచరియలు విరిగి పడటంతో దాదాపు 400 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఫులి పట్టణంలోని డోంగ్లీ స్టేషన్‌లో ఓ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఓ స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు అటు ఇటు ఊగిపోతున్నట్లు కనిపిస్తోన్న వీడియో.. నెట్టింట వైరల్‌గా మారింది.

తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌వెన్‌ ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఈ విపత్తుపై మాట్లాడారు. మరిన్ని ప్రకంపనాలు వచ్చే అవకాశం ఉందని పౌరులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల కోసం విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు.. భారీ భూకంపం కారణంగా జపాన్ వాతావరణ సంస్థ సైతం తైవాన్ సమీపంలోని దక్షిణ జపనీస్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని