Ukraine: వారు కోల్పోయినదేంటో చెప్పే రిమైండర్ ఈ చిత్రం..!

రష్యా దురాక్రమణ ఉక్రెయిన్ విద్యార్థుల భవితను ప్రశ్నార్థకం చేసింది. తమ విద్యార్థి జీవితంలో మరో అంకం ఆరంభించాలనుకునే వారి ఆశలను ఆటంకపరిచింది.

Updated : 14 Jun 2022 14:09 IST

కీవ్‌: రష్యా దురాక్రమణ ఉక్రెయిన్ విద్యార్థుల భవితను ప్రశ్నార్థకం చేసింది. తమ విద్యార్థి జీవితంలో మరో అంకం ఆరంభించాలనుకునే వారి ఆశలను నాశనం చేసింది. పుతిన్ సేనల దాడిలో విద్యాసంస్థలు భవిష్యత్తును కోల్పోయి.. శిథిలాలుగా దర్శనమిస్తున్నాయి. ఎంతో ఉత్సాహంగా గ్రాడ్యుయేషన్ వేడుక జరుపుకోవాల్సిన పిల్లలు.. వాటి ముందు తమ గ్రూప్‌ ఫొటో దిగాల్సి వచ్చింది. దానిని ఉక్రెయిన్ అధికారిణి ఒకరు ట్వీట్ చేశారు. ‘చెర్నిగివ్ పాఠశాల వద్ద గ్రాడ్యుయేషన్’ అంటూ ఆ చిత్రాన్ని షేర్ చేశారు. ఆ  ఫొటోలో బ్యాగ్రౌండ్‌గా.. యుద్ధానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ పాఠశాల మారిపోయింది.

ఈ యుద్ధం మిగిల్చిన నష్టాలు, విషాదాలు బంధించాల్సిన అవసరం ఉందని 25 ఏళ్ల ఫొటోగ్రాఫర్ స్టానిస్లావ్ సెనిక్ భావించారు. వివిధ పాఠశాలల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 40 మంది సీనియర్ల అనుభవాలను పొందుపర్చాలనుకున్నారు. ‘10-15 సంవత్సరాల తర్వాత వారి పిల్లలకు ఈ దృశ్యాలను చూపించి, వారు ఎదుర్కొన్న పరిస్థితులను వివరించొచ్చు’ అంటూ తాను చేసిన ప్రయత్నం గురించి మీడియాకు వెల్లడించారు. తాజాగా వైరల్‌గా మారిన ఈ చిత్రం ఆ కోవకు చెందినదే. తమ పక్కనే శిథిలాలు కనిపిస్తున్నా.. తాము నిర్భయంగా ఉన్నామని ఆ ఫొటో ద్వారా ఆ విద్యార్థులు ప్రపంచానికి చాటారు. వారు కోల్పోయినదేంటో తెలియజేసే శక్తిమంతమైన రిమైండర్ ఇది.. హృదయం ముక్కలవుతోంది, కానీ వారు ధైర్యంగా కనిపిస్తున్నారంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఇప్పటికే మూడు నెలలు దాటింది. ప్రస్తుతం డాన్‌బాస్‌ ప్రాంతంలో పుతిన్ సేనలు ధ్వంస రచన చేస్తున్నాయి. అక్కడి సెవీరోదొనెట్స్క్‌ను స్వాధీనం చేసుకోవడంపై రష్యన్లు పూర్తిగా దృష్టిపెట్టారు. మరోపక్క రష్యాతో పోరాడేందుకు అమెరికా, దాని మిత్రదేశాల నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధాలు, ఇతర సహకారం అందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు