Pakistan: పోలీసు యూనిఫాంలో వచ్చి.. మారణహోమం సృష్టించి..!

పాక్‌(Pakistan) ఉగ్రఘటనలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సూసైడ్‌ బాంబర్ పోలీసు దుస్తుల్లో వచ్చిన ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 

Published : 02 Feb 2023 21:53 IST

పెషావర్‌: పాకిస్థాన్‌(Pakistan) పెషావర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 101 మంది మృతి చెందారు. అందులో 97 మంది పోలీసులే. కాగా, దర్యాప్తులో భాగంగా దుర్ఘటనకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మాహుతికి పాల్పడిన బాంబర్‌(suicide bomber ) హెల్మెట్ ధరించి, పోలీసు యూనిఫాంలో వచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. 

‘అతడు పోలీసు యూనిఫాంలో ఉండటంతో అప్పుడు డ్యూటీలో ఉన్నవారు తనిఖీ చేయలేదు. ఇది భద్రతా లోపం. సీసీటీవీ దృశ్యాలతో ఘటనా స్థలంలో దొరికిన తలతో సరిపోల్చడంతో బాంబర్‌ గురించి ప్రాథమికంగా స్పష్టత వచ్చింది. అతడి వెనక పెద్ద నెట్‌వర్క్‌ ఉంది. ఈ ఆత్మాహుతి ప్రణాళిక వెనక అతడొక్కడే లేడు’ అని తెలిపారు. 

పోలీస్ లైన్స్ ప్రాంతంలోని మసీదులో సోమవారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో ఈ పేలుడు ఘటన జరిగింది. ఆ సమయంలో పోలీసులు, సైన్యం, బాంబు నిర్వీర్య దళం అక్కడే ప్రార్థనల్లో ఉన్నట్టు సమాచారం. బాంబు తీవ్రతకు గోడ కూలడంతో దాని కింద కొందరు నలిగిపోయి మృతి చెందారు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఈ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంపై అధికారులు విస్తృత దర్యాప్తు చేపడుతున్నారు. 

ముజాహిదీన్‌లను సృష్టించి పాకిస్థాన్‌(Pakistan) తప్పు చేసిందని ఈ మారణహోమంపై ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా వాపోయారు. ‘మనం ముజాహిదీన్‌లను సృష్టించాం. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు’ అని పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులతో తాము పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదని మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని