Rishi Sunak: సునాక్‌ మీరు బిలియనీరా..? బ్రిటన్‌ ప్రధాని సమాధానమిదే..

తన పన్ను వివరాలు త్వరలో వెల్లడిస్తానని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) వెల్లడించారు. అలాగే తన బ్యాంకులో ఎంత మొత్తం ఉందనేదాని కంటే.. దేశం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనేదే తనకు ముఖ్యమని చెప్పారు. 

Published : 04 Feb 2023 01:46 IST

లండన్‌: బ్రిటన్‌ (Britain) ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak), ఆయన సతీమణి అక్షతా మూర్తి ఆస్తుల గురించి తరచూ ప్రస్తావన వస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పీర్స్‌ మోర్గాన్‌ అనే పాత్రికేయుడు ఆయన బ్యాంకు బ్యాలన్స్ గురించి ప్రశ్నించారు. దీనికి సునాక్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

పీర్స్‌ మోర్గాన్‌: మీ ఆస్తి ఎంత..? 

సునాక్‌: ఆర్థికంగా అదృష్టవంతుడిని.

మోర్గాన్‌: మీరు బిలియనీరా..?

సునాక్‌: ఇప్పుడు నేను ఆ వివరాలు వెల్లడించదల్చుకోలేదు. నా బ్యాంకు ఖాతాలో ఎంత ఉందన్నది ముఖ్యం కాదు. నా విలువలు ఏంటి? నేను తీసుకునే చర్యలు ఏంటనేది ఇక్కడ ముఖ్యం.

ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీలోని ఇద్దరు అగ్రస్థాయి నేతల పన్ను వ్యవహారాలపై వివాదం చెలరేగుతున్న సమయంలో రిషి కీలక విషయం వెల్లడించారు. తన పన్ను వివరాలను వెల్లడించడానికి, తన ఆర్థిక విషయాలను పారదర్శకంగా ఉంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సునాక్‌కు దాదాపు 70 కోట్ల పౌండ్ల (సుమారు రూ.6,600 కోట్లు) విలువైన ఆస్తిపాస్తులు ఉన్నాయి. యార్క్‌షైర్‌లో సువిశాలమైన బంగ్లాతో పాటు లండన్‌లోని కెన్సింగ్టన్‌లో సునాక్‌ దంపతులకు మరో భవంతి ఉంది. అక్షతా మూర్తి.. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె.  

ఇదిలా ఉంటే.. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం సామాజిక మాధ్యమాల్లో సునాక్‌ ఓ వీడియోను విడుదల చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం తదితర అనేక సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధి దిశగా మార్పు సాధించడానికి ప్రతినబూనినట్లు వివరించారు.  భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ గతేడాది అక్టోబరు 25న పాలనా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. రాబోయే ఏడాదికి సంబంధించి ప్రధానమైన అయిదు లక్ష్యాలను వీడియోలో పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ కట్టడి, ఆర్థికరంగం వృద్ధి, రుణ భారం తగ్గింపు, జాతీయ ఆరోగ్య సేవల నిరీక్షణ జాబితాను తగ్గించడం, అక్రమ వలసల నిరోధం అంశాలు అందులో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు