Rishi Sunak: వాటిపై సునాక్‌ ఏనాడు పెనాల్టీ చెల్లించలేదు..

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) చెల్లించే పన్నుల గురించి ఆయన మీడియా కార్యదర్శి ఓ విషయం వెల్లడించారు. ఈ మేరకు పాత్రికేయులతో మాట్లాడారు. 

Published : 27 Jan 2023 00:41 IST

లండన్‌: బ్రిటన్‌(Britain) ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) ఎన్నడూ పన్నులపై పెనాల్టీ చెల్లించలేదని ఆయన మీడియా కార్యదర్శి వెల్లడించారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఛైర్మన్‌ నదీమ్ జహావి పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సునాక్‌ గురించి స్పందన వచ్చింది. 

‘ప్రధాన మంత్రి పన్ను వ్యవహారాల గురించి ప్రస్తావిస్తానని మీరు ఊహించి ఉండరు. ఆ విషయాలు గోప్యంగా ఉంటాయి. ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ.. ఆ వివరాలను గోప్యంగా ఉంచుతారు. అయితే ప్రధాని గురించి మీకో విషయం చెప్తాను. ఆయన ఎన్నడూ పన్నుపై పెనాల్టీ చెల్లించలేదు’ అని తెలిపారు. 

జహావి మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సునాక్‌(Rishi Sunak) ప్రభుత్వంపై విపక్షాలు, చివరకు కన్జర్వేటివ్‌ పార్టీ నేతల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఆయన్ను వెంటనే తొలగించాలని వారు డిమాండ్  చేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించాలని సునాక్‌ ఆదేశించారు. బోరిస్ జాన్సన్‌ నేతృత్వంలో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. లాక్‌డౌన్‌ పార్టీలు తీవ్ర వివాదాస్పదం కావడంతో ఆయన పదవి నుంచి దిగిపోయారు. తర్వాత వచ్చిన లిజ్‌ట్రస్‌ తన నిర్ణయాల కారణంగా ఎంతో కాలం పదవిలో ఉండలేకపోయారు. సునాక్‌ కూడా ఏదో ఒక అంశంపై విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని