Abudabi: అబుదాబి ఎయిర్‌పోర్టుపై డ్రోన్‌ దాడి.. మృతుల్లో ఇద్దరు భారతీయులు!

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా అనుమానిత డ్రోన్‌ దాడి జరిగింది. ఈ దాడిలో మూడు ఆయిల్‌ ట్యాంకర్లు పేలడంతో......

Published : 17 Jan 2022 17:38 IST

అబుదాబి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా అనుమానిత డ్రోన్‌ దాడి జరిగింది. ఈ దాడిలో మూడు ఆయిల్‌ ట్యాంకర్లు పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురు స్వల్పంగా గాయపడినట్టు అబుదాబి పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉండగా.. ఒకరిని పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు చెప్పారు. గాయపడిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఘటనకు డ్రోన్‌ దాడులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అబుదాబి విమానాశ్రయంపై దాడులు తమ పనేనంటూ హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు.

తొలుత ప్రధాన విమానాశ్రయంలో ఒక పేలుడు జరగ్గా.. మరో చోట మూడు చమురు ట్యాంకులు పేలినట్టు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన పేలుడు చిన్నదేనని పోలీసులు తెలిపారు. విమానాశ్రయం విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్న భాగంలో ఈ దాడులు జరిగినట్టు వెల్లడించారు. ఇండస్ట్రీ మస్తఫా ప్రాంతంలో అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీకి చెందిన మూడు పెట్రోలియం ట్యాంకర్లపైనా దాడులు జరిగినట్టు పేర్కొన్నారు. ఎగిరే చిన్న వస్తువులు పడిన తర్వాత చమురు ట్యాంకులు పేలినట్టు పోలీసులు తెలిపారు. యెమెన్‌లో ఇరాన్‌ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులతో 2015 నుంచి సౌదీ నేతృత్వంలో యూఏఈ యుద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీతో పాటు యూఏఈని కూడా హౌతీ తిరుగుబాటుదారుల సంస్థ లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని