North Korea: దక్షిణ కొరియాను మరోసారి ఇబ్బంది పెట్టిన ఉత్తర కొరియా

దక్షిణ కొరియా సరిహద్దుల సమీపంలోని ఇమ్జిన్‌ నదిపై ఉన్న డ్యామ్‌ నుంచి ఉత్తర కొరియా హఠాత్తుగా నీటిని విడుదల చేసింది. ఈ ఘటనతో ఒక్కసారి నీటి మట్టాలు పెరగడంతో ఆ నదీ పరీవాహక

Published : 06 Jul 2022 17:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియా సరిహద్దుల సమీపంలోని ఇమ్జిన్‌ నదిపై ఉన్న డ్యామ్‌ నుంచి ఉత్తర కొరియా హఠాత్తుగా నీటిని విడుదల చేసింది. ఈ ఘటనతో ఒక్కసారి నీటి మట్టాలు పెరగడంతో ఆ నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలను హుటాహుటిన ఖాళీ చేయించింది. సోమవారం ఈ నదిపై యెన్‌చెన్‌ కౌంటీ వద్ద ఉన్న వంతెన సమీపంలో మీటర్‌ మేరకు నీటి మట్టం పెరగడంతో వెంటనే పర్యాటకులను, నది ఒడ్డున ఉన్నవారిని ఖాళీ చేయించారు. దీనిపై సియోల్‌కు చెందిన ఇంటర్‌ కొరియన్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘హ్వంగాంగ్‌ డ్యామ్‌ నుంచి ఉత్తరకొరియా నీటిని విడుదల చేసినట్లుంది’’ అని వ్యాఖ్యానించారు.

ద.కొరియా ప్రభుత్వం ఎంత మందిని ఖాళీ చేయించిందనే విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం నీటి మట్టం 5.2 అడుగులు తగ్గుముఖం  పట్టిందని యెన్‌చెన్‌ కౌంటీ అధికారులు తెలిపారు. ఇటీవల ఉత్తర కొరియాలో భారీ వర్షాలు పడటంతో ఎటువంటి సమాచారం లేకుండానే నీటిని దిగువకు విడుదల చేసింది. నీటిని విడుదలకు ముందు నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే దక్షిణ కొరియా అధికారులు పలు మార్లు ఉత్తరకొరియా అధికారులను కోరారు. కానీ, ప్యాంగ్‌యాంగ్‌ నుంచి ఎటువంటి స్పందనా లేదు. 

2019లో ఉత్తరకొరియా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే కిందికి నీటిని విడుదల చేసింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఆరుగురు దక్షిణ కొరియా వాసులు చనిపోయారు. ఆ తర్వాత ఈ అంశంపై ఇరుదేశాలు చర్చించుకొన్నాయి. అప్పట్లో మృతులకు ఎట్టకేలకు ప్యాంగ్‌యాంగ్‌ దౌత్య బృందం సంతాపం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని