Syria: భూకంపంలో ధ్వంసమైన జైలు.. ఐఎస్‌ ఉగ్రవాదులు పరార్‌..!

భూకంపంతో ధ్వంసమైన ఓ జైలు (Prison) నుంచి ఖైదీలు పారిపోయిన ఘటన సిరియా (Syria)లో చోటుచేసుకుంది. అయితే, పారిపోయిన వారంతా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులేనని (IS terrorists) అధికారులు అంచనా వేస్తున్నారు. 

Updated : 07 Feb 2023 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాను (Syria) తాజా భూకంపం (Earthquake) మరింత వణికిస్తోంది. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోగా.. కూలిపోయిన భవనాల కింద వేల మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో భూకంపం కారణంగా అక్కడ ఓ జైలు ధ్వంసమైంది. ఇదే అదనుగా భావించిన కొందరు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు (IS terrorists).. అధికారులపై తిరుగుబాటు చేసి పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.

నైరుతీ సిరియాలోని రాజో ప్రాంతంలో మిలటరీ పోలీస్‌ జైలు ఉంది. అక్కడ సుమారు 2వేల మంది ఖైదీలు ఉన్నారు. అందులో సుమారు 1300 మంది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలకు చెందినవారే. అయితే, సోమవారం సంభవించిన భూకంపంలో ఆ జైలు ధ్వంసమైంది. అదే సమయంలో కొందరు ఖైదీలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సుమారు 20 మంది పారిపోయారని.. వారంతా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులేనని జైలు అధికారులు అనుమానిస్తున్నారు. జిహాదీలను విడిపించుకునేందుకు గాను అక్కడి రాఖా జైలుపై కొన్ని వారాల క్రితమే దాడి జరిగింది. ఈ ఘటన జరిగి కొన్ని వారాల వ్యవధిలోనే భూకంపం రావడంతో అక్కడి నుంచి ఐఎస్‌ ఉగ్రవాదులు పారిపోవడం గమనార్హం.

మరోవైపు సిరియాలో భూకంప ప్రభావానికి వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 1600 మంది చనిపోయినట్లు పేర్కొన్నప్పటికీ మృతుల సంఖ్య భారీగా ఉండనుందని అంచనా. తుర్కియే, సిరియాలో కలిపి ఇప్పటికే 5వేలకుపైగా మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, శిథిలాల కింద వేల మంది చిక్కుకొని ఉండవచ్చని.. వాస్తవంగా ఈ సంఖ్య 20వేలకుపైనే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని