Taiwan: ‘మాకూ ఉక్రెయిన్‌ లాంటి పరిస్థితే వస్తే.. మద్దతు ఇస్తారనుకుంటున్నాం’

తమపై చైనా దురాక్రమణకు దిగితే, అంతర్జాతీయ సమాజం దానిని ఆంక్షల చట్రంలో బంధిస్తుందని తైవాన్ ఆశిస్తోంది.

Published : 08 May 2022 02:12 IST

తైపీ: తమపై చైనా దురాక్రమణకు దిగితే, అంతర్జాతీయ సమాజం దానిని ఆంక్షల చట్రంలో బంధిస్తుందని తైవాన్ ఆశిస్తోంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడుతోన్న రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్న తీరును గమనించి ఆ ద్వీప దేశం ఈ ఆశలు పెట్టుకుంటోంది. 

‘భవిష్యత్తులో తైవాన్.. చైనా వల్ల బెదిరింపులకు గురైనా, ఆక్రమణకు గురైనా..అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకొని, మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాను. ఈ తరహా దూకుడు ప్రవర్తనపై ఆంక్షలు విధిస్తారనుకుంటున్నాం. అందుకే ఉక్రెయిన్‌ సంక్షోభం వేళ.. తైవాన్ అంతర్జాతీయ సమాజానికి అండగా నిలుస్తోంది. ఆంక్షలు విధిస్తోంది’ అంటూ తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూ అన్నారు. తైపీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటి నుంచి ఆ దాడి కొనసాగిస్తూనే ఉంది. దానిని కట్టడి చేసేందుకు అమెరికా, సహా అనేక దేశాలు రష్యాపై ఆంక్షల కొరడాను ఝుళిపిస్తున్నాయి. రష్యా మిత్రదేశం బెలారస్‌ను కూడా ఆంక్షల జాబితాలో చేర్చాయి. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తోన్న తైవాన్ కూడా పాశ్చాత్య దేశాలతో చేరింది. ఇదిలా ఉండగా.. రష్యా దురాక్రమణను చూసిన తైవాన్, తమకు అలాంటి ముప్పు రావొచ్చనే అంచనాతో దేశంలో అప్రమత్తత స్థాయిని పెంచింది. తక్షణమే చైనా దాడి జరుగుతుందనే సంకేతాలను మాత్రం ఆ దేశం వెలువరించలేదు. అలాగే 70 రోజులుగా పుతిన్ సేనలకు ఎదురొడ్డి నిలుస్తోన్న ఉక్రెయిన్‌పై తైవాన్ ప్రశంసలు కురింపించింది. గొప్పగా పోరాడుతోందంటూ పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని