తైవాన్‌ చేతికి 1,000 అమెరికా సాయుధ డ్రోన్లు..!

ఉక్రెయిన్‌లో విజయవంతంగా ప్రయోగించిన కొన్ని ఆయుధాలను ఇప్పుడు తైవాన్‌కు అందజేయాలని అమెరికా నిర్ణయించింది. 

Published : 19 Jun 2024 13:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌(Taiwan)కు భారీ సంఖ్యలో సాయుధ డ్రోన్లు విక్రయించాలని అమెరికా నిర్ణయించింది. ఇప్పటికే ఆమోదముద్ర వేసిన విక్రయ డీల్‌లో ఇవి ఉన్నాయి. వీటి సంఖ్య 1,000 వరకూ ఉండొచ్చు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాను ముప్పతిప్పలు పెట్టిన ఈ డ్రోన్లు తాజాగా తైవాన్‌ చేతికి అందనుండటం విశేషం.  

ఈ డీల్‌లో భాగంగా 60 మిలియన్‌ డాలర్ల విలువైన 720 స్విచ్‌బ్లేడ్‌ డ్రోన్లు, ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థలను తైపీకి అందించనుంది. ఈ విషయాన్ని అమెరికా డిఫెన్స్‌, సెక్రటరీ కోఆపరేషన్‌ ఏజెన్సీ డీఎస్‌సీఏ మంగళవారం వెల్లడించింది. వీటితోపాటు 291 ఆల్టియూస్‌ 600ఎం లాయిటరింగ్‌ ఆయుధాలు, వీటి సపోర్టింగ్‌ వ్యవస్థలను సరఫరా చేయనుంది. 

తైవాన్‌పై సైనిక ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఈ విక్రయాలకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది. అమెరికాలోని తైవాన్ రిలేషన్స్‌ యాక్ట్‌ కింద ఆ దేశం ఆత్మరక్షణ చేసుకోవడానికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేయవచ్చు. ఇప్పటికే ఈ చర్యలను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల షంగ్రి లా సదస్సులో కూడా బాహ్యశక్తులు తైవాన్‌ అధికారులతో అక్రమంగా సంప్రదింపులు జరిపి ఆయుధాలను సరఫరా చేస్తున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే. 

అమెరికాకు చెందిన ఏరో వైర్మాన్మెంట్‌ సంస్థ ది స్విచ్‌ బ్లేడ్‌ పేరుతో డ్రోన్లను తయారుచేస్తోంది. దీనిలో స్విచ్‌బ్లేడ్‌ 300, 600 రకాలు ఉన్నాయి. ప్రిడేటర్‌లా విమానం సైజులో ఉండవు. ఇవి అతిచిన్న సైజులో ఉన్న  లాయిటరింగ్‌ మ్యూనిషన్‌ (గాల్లో చక్కర్లు కొడుతూ.. లక్ష్యం కనిపించగానే దానిపై పడి దాడి చేసేది). వీటిని ఆత్మాహుతి డ్రోన్ల కేటగిరీలో పేర్కొంటారు. ఈ డ్రోన్లను సైనికుడు బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకొని కూడా ప్రయాణించవచ్చు. ఈ డ్రోన్లను కొండల్లో, సముద్రాల్లో, గాల్లో నుంచి శత్రువుకు దూరంగా ఉండి ప్రయోగించవచ్చు.  ప్రయోగించిన తర్వాతే దీని రెక్కలు విచ్చుకొని గాల్లో డ్రోన్‌లా ఎగురుతుంది. అందుకే స్విచ్‌ బ్లేడ్‌ అని పేరుపెట్టారు. ఇది ఒక సైనిక వాహనాన్ని 10 కిలోమీటర్ల దూరం నుంచి ధ్వంసం చేసే అవకాశం కల్పిస్తుంది. అంతేకాదు దీని ఆపరేటర్‌కు రియల్‌ టైమ్‌ వీడియో లింక్‌ను కూడా అందిస్తుంది. ఆపరేటర్‌కు యుద్ధక్షేత్రంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ డ్రోన్‌ను ప్రత్యేకమైన ట్యూబ్‌ నుంచి లాంచ్‌ చేయవచ్చు.

‘స్విచ్‌బ్లేడ్‌ 300’ డ్రోన్లు కేవలం 2.5 కిలోల బరువు మాత్రమే ఉంటాయి. వీటి పొడవు 24 అంగుళాలు. ఇవి 10 కిలోమీటర్ల అవతల లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇది 500 అడుగుల కంటే తక్కువ ఎత్తులో 10 నిమిషాలు గాల్లో ఎగరగలదు. ఈ డ్రోన్‌ను కేవలం రెండు నిమిషాల్లో ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని