Taiwan: యుద్ధమే వస్తే ఇలా చేయండి..! తొలిసారి హ్యాండ్‌బుక్‌ విడుదల చేసిన తైవాన్‌

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ సంక్షోభం కొనసాగుతోన్న వేళ.. చైనా నుంచి ముప్పు పొంచి ఉందని భావిస్తున్న తైవాన్‌ సైతం అప్రమత్తమవుతోంది. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం పౌర రక్షణపై ఓ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది...

Published : 13 Apr 2022 01:14 IST

తైపీ: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ సంక్షోభం కొనసాగుతోన్న వేళ.. చైనా నుంచి ముప్పు పొంచి ఉందని భావిస్తున్న తైవాన్‌ సైతం అప్రమత్తమవుతోంది. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం పౌర రక్షణపై ఓ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. ఒకవేళ దేశంలో యుద్ధ పరిస్థితులే ఏర్పడితే.. పౌరులు ఏ విధంగా స్పందించాలనే దానిపై అందులో మార్గదర్శకాలు పొందుపరిచింది. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ల ద్వారా బాంబు షెల్టర్లను కనుక్కోవడం, ఆహార లభ్యత ప్రదేశాలు.. అలాగే, ప్రథమ చికిత్స సామగ్రి తయారీ చిట్కాలను అందులో వివరించింది. సైనిక సంక్షోభం, విపత్తుల సమయంలో పౌరులు ఎలా స్పందించాలనే దానిపై సమాచారం అందిస్తున్నామని స్థానిక రక్షణ శాఖ అధికారి లియు తాయ్ యీ ఓ వార్తాసమావేశంలో తెలిపారు. స్థానిక ఆసుపత్రులు, దుకాణాలు తదితర సమాచారంతో దీన్ని మరింత అప్‌డేట్ చేస్తామని చెప్పారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ప్రపంచ దేశాల దృష్టి తైవాన్‌ అంశంపైకి మళ్లిన విషయం తెలిసిందే. ఆ దేశానికీ ఇలాంటి దుస్థితి ఎదురవుతుందా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. స్వయం పాలనలో ఉన్న తైవాన్‌.. చైనాలో భాగమేనని, దాన్ని కలిపేసుకుంటామని చైనా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో.. తైవాన్‌ సమీపంలోకి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను పంపుతూ భయాందోళనలూ కలిగిస్తోంది. మరోవైపు తైవాన్‌ మాత్రం.. చైనా నుంచి వెంటనే దురాక్రమణ ముప్పు పొంచి ఉందని ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ, ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హెచ్చరిక స్థాయిని పెంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని