Updated : 17 Jan 2022 20:25 IST

Breast Feeding: పాలిచ్చే తల్లుల ఫొటోలు తీస్తే.. జైలుకే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి మహిళ.. ఏదో ఒక సందర్భంలో వివక్షకు, వేధింపులకు గురవుతూనే ఉంది. వావివరుసలు, వయోభేదం లేకుండా మహిళలపై కామాంధులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. ఆఖరికి బిడ్డకు పాలిచ్చే తల్లులను కూడా కామేచ్ఛతో చూసే మృగాలు ఈ సమాజంలో తిరుగుతున్నాయి. చంటిబిడ్డలకు తల్లిపాలే శ్రేయస్కరం కావడంతో ఎక్కడికి వెళ్లినా.. ఏ సమయంలోనైనా బిడ్డకు చనుబాలు పట్టాల్సిందే. ఇదే సమయంలో కొందరు ఆకతాయిలు తల్లుల్ని ఫొటోలు తీస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలాంటి వేధింపులను అడ్డుకునేలా ఇంగ్లాండ్‌, వేల్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నాయి. చనుబాలు పడుతున్న తల్లుల ఫొటోలు/వీడియోలను వారి అనుమతి లేకుండా తీస్తే రెండేళ్ల జైలు శిక్ష పడేలా తమ న్యాయ చట్టాల్లో సవరణ చేశాయి. 

మహిళా ఎంపీనీ వదల్లేదు..

చంటిబిడ్డ తల్లులు ఇలాంటి అభ్యంతరకర ఘటనలను ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నారు. యూకేకి చెందిన స్టెల్లా క్రీసీ, జులియా కూపర్‌ కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్టెల్లా.. యూకే పార్లమెంట్‌ సభ్యురాలు. ఆమె నార్త్‌ లండన్‌లో ఓసారి రైలులో వెళ్తూ తన నాలుగు నెలల బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఫొటో తీశాడట. జులియా.. మాంచెస్టర్‌లో పాపులర్‌ డిజైనర్‌. తను ఓ పార్కులో కూర్చొని చంటిపాపకు చనుబాలు పడుతుండగా ఓ ఆకతాయి అతడి కెమెరాకు జూమ్‌ లెన్స్‌ అమర్చి మరీ తన ఫొటోలు తీశాడట. ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అది నేరం కిందకు రాదని కేసు నమోదు చేసుకోలేదట.

ఉద్యమానికి తలొంచిన ప్రభుత్వం

ఇలా ఎవరూ పెద్దగా పట్టించుకోని ఈ సమస్యను వీరిద్దరూ ప్రపంచం దృష్టికి తేవాలనుకున్నారు. మరికొందరితో కలిసి ‘స్టాప్‌ ది బ్రెస్ట్‌పెస్ట్స్‌’ పేరుతో తల్లులపై వేధింపులకు వ్యతిరేకంగా డిజిటల్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆన్‌లైన్‌ పిటిషన్‌ దాఖలు చేసి.. మాతృమూర్తుల్ని సంతకాలు చేయమని కోరారు. అలా వీరి ఉద్యమం ఉద్ధృతమై.. యూకే పార్లమెంట్‌ దిగువ సభ వరకూ వెళ్లింది. దీంతో అనుమతి లేకుండా చనుబాలు పట్టే తల్లుల ఫొటోలు/వీడియోలు తీయడాన్ని నేరంగా పరిగణిస్తూ పోలీస్‌, క్రైమ్‌, సెంటెన్సింగ్‌ అండ్‌ కోర్ట్‌ బిల్లులో సవరణ చేస్తున్నట్లు న్యాయశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై లా కమిషన్‌ సమీక్షిస్తోంది. త్వరలోనే ఇది చట్టంగా మారి అమల్లోకి రానుంది. 

‘‘ఏ ఒక్క చంటిబిడ్డ తల్లి అలాంటి వేధింపులకు గురికాకూడదు. ఇకపై ఆ చర్యలను కూడా నేరంగా పరిగణిస్తాం. ఈ క్రమంలోనే చట్ట సవరణ చేస్తున్నాం. మహిళల రక్షణ కోసం మేం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని అక్కడి న్యాయశాఖ ప్రతినిధులు వెల్లడించారు.

ఇది గొప్ప ముందడుగు: నేహా ధూపియా

యూకే తీసుకున్న ఈ నిర్ణయాన్ని బాలీవుడ్‌ నటి నేహా ధూపియా స్వాగతించారు. ఇన్‌స్టా వేదికగా ఈ అంశంపై ఆమె స్పందిస్తూ.. ఇది బిడ్డలకు తల్లులు స్వేచ్ఛగా పాలిచ్చే విధంగా తీసుకున్న గొప్ప ముందడుగు, ప్రపంచం కూడా ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘స్టాప్‌ ది బ్రెస్ట్‌ పెస్ట్స్‌’ తరహాలోనే ‘ఫ్రీడమ్‌ టు ఫీడ్‌’ పేరుతో చాలాకాలంగా నేహా ఒక ఆన్‌లైన్‌ కమ్యూనిటీని నిర్వహిస్తున్నారు. పిల్లలను పెంచి పోషించే విషయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts