Afghanistan: మాట మార్చేసిన తాలిబన్లు.. బాలికల భవితవ్యం బుగ్గిపాలు!

బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించబోమని.. ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది......

Updated : 24 Mar 2022 13:11 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్​లో అధికారం చేపట్టిన తాలిబన్లు.. తమ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఆక్రమణ అనంతరం పలు నిబంధనలతో అనేక మంది బాలికలు చదువుకు దూరమవగా.. వారి విద్యకు కూడా అనుమతిస్తున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. అయితే ఆ వాగ్దానాలు నీటి మూటగానే మారిపోయాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తాలిబన్లు తమ మాట మార్చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించబోమని.. ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అఫ్గాన్‌లోని మహిళలకు విద్య, ఉద్యోగంపై పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్​ చేస్తూనే ఉంది. తాలిబన్లు ఇందుకు అంగీకరించినా ఇప్పుడు చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇందుకు గ్రామీణ ప్రజలే కారణమని పేర్కొన్నారు. తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు అక్కడి గిరిజనులు విముఖత చూపుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిషేధం తాత్కాలికమే అని, భవిష్యత్తులో వారిని అనుమతించే అవకాశం ఉందని తాలిబన్ అధికారి ఒకరు చెప్పారు.

అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలపై తాలిబన్లు అనేక ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. దీంతో చాలామంది తమ ఉద్యోగాలకు దూరమయ్యారు. మహిళలపై కఠిన ఆంక్షల నేపథ్యంలో సీనియర్​ నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. కొందరు కఠిన పాలనకే మొగ్గు చూపుతుంటే, మరికొందరు మాత్రం సంస్కరణలు చేపట్టడం అవసరమని వాదిస్తున్నారు. ప్రజలపై, ముఖ్యంగా మహిళలపై విధించిన ఆంక్షలను సడలించాలని వారు పట్టుబడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని