‘తెలీదు.. విచారణ జరుపుతాం.. తెలుసుకుంటాం’.. జవహారీ మరణంపై తాలిబన్లు!

Talibans on Al-Jawahiri killing: అమెరికా డ్రోన్‌ దాడిలో అల్‌ఖైదా నేత అల్‌ జవహరీ మరణంపై అఫ్గాన్‌లోని తాలిబన్లు తొలిసారి స్పందించారు.

Published : 05 Aug 2022 01:28 IST

కాబుల్‌: అమెరికా డ్రోన్‌ దాడిలో అల్‌ఖైదా నేత అల్‌ జవహరీ (Al-Jawahiri) మరణంపై అఫ్గాన్‌లోని తాలిబన్లు తొలిసారి స్పందించారు. అల్‌ఖైదా నేత హతమైన రెండ్రోజుల తర్వాత ఓ ప్రకటన చేశారు. జవహరీ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తాలిబన్ల ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వానికి గానీ, తాలిబన్‌ నేతలకు గానీ అక్కడేం జరిగిందో ఏమాత్రం తెలీదని దోహాలో తాలిబన్ల ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. దీనిపై నాయకత్వం సైతం సమావేశమవుతోందని, వివరాలు త్వరలోనే బయటపెడతామన్నారు. ఈ ప్రకటన కంటే ముందు ఎలా స్పందించాలన్న దానిపై తాలిబన్‌ నాయకత్వం తీవ్ర తర్జనభర్జనలు పడినట్లు తెలిసింది.

అల్‌ఖైదా అగ్రనేత అల్‌ జవహరీ కాబుల్‌లోని ఓ నివాసంలో ఉండగా.. అమెరికా అతడిని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. జవహారీ మరణాన్ని ధ్రువీకరిస్తూ అమెరికా కీలక ప్రకటన కూడా చేసింది. జవహరీ నివాసం ఉన్న ఇల్లు సైతం హక్కానీ నేత సిరాజుద్దీన్‌ హక్కానీకి అనుచరుడిదిగా తేలింది. జవహరీ మరణం అఫ్గానిస్థాన్‌ను ఏలుతున్న తాలిబన్లకు, అల్‌ఖైదాకు మధ్యనున్న పొత్తును ప్రపంచానికి బట్టబయలు చేసింది. అంతర్జాతీయ గుర్తింపు, ఆర్థిక సాయం కోసం తాలిబన్ల ప్రయత్నాన్నీ దెబ్బతీసింది.

అఫ్గాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు 2020లో కుదిరిన దోహా ఒప్పందం ప్రకారం తాలిబన్‌ సర్కారు తమ భూభాగంపై అల్‌ఖైదా సభ్యులకు ఆశ్రయమివ్వబోమని మాట ఇచ్చింది. జవహరీ కాబూల్‌లోనే ఒక సురక్షిత గృహంలో ఆశ్రయం పొందడాన్ని బట్టి దోహా ఒప్పందాన్ని తాలిబన్లు ఉల్లంఘించినట్లయింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, ఆడ పిల్లలు ఆరో తరగతికి మించి చదవకూడదని ఆంక్షలు విధిస్తున్నారని ఇప్పటికే అంతర్జాతీయంగా తాలిబన్లపై విమర్శలు వస్తున్నాయి. కొవిడ్‌ దెబ్బకు, పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలకు కుదేలైన తాలిబన్‌ సర్కారు అంతర్జాతీయ ఆర్థిక సాయం కోసం చూస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే జవహరీ అక్కడ హతమవడం దొరికిపోయిన దొంగలయ్యారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జవహరీ అఫ్గాన్‌లోనే ఉన్నారన్న విషయమే తమకు తెలీదన్న రీతిలో తాలిబన్లు కవరింగ్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని