Taliban: ప్రిన్స్ హ్యారీ పరాజితుడు... తాలిబన్‌ ప్రతినిధి విమర్శలు..!

అఫ్గాన్‌ యుద్ధంలో 25 మందిని చంపినట్లు ప్రిన్స్‌ హ్యారీ చెప్పుకోవడాన్ని తాలిబన్లు తప్పుపట్టారు. అతడు పిరికి వాడని అభివర్ణించారు. 

Published : 08 Jan 2023 16:20 IST

 ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గాన్‌(Afghanistan) యుద్ధంలో 25 మందిని హతమార్చినట్లు బ్రిటన్‌ రాజవంశానికి చెందిన ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry)చెప్పుకోడాన్ని తాలిబన్లు ఎగతాళి చేశారు. తాలిబన్‌ కమాండర్‌ మౌల్వీ అఘా గోల్ ఎద్దేవా చేశారు. అందరి దృష్టిని ఆకర్షించడానికి గొప్పలు చెప్పుకొంటున్నాడన్నారు. ‘‘అతడు ముజాహిద్దీన్‌ల గురించి చెప్పివేవీ నమ్మబుద్ధి కావడంలేదు. అతడు పరాజితుడు. యుద్ధ క్షేత్రానికి వెళ్లడానికి కూడా భయపడ్డాడు. మేము అతడిని, అతడి సైన్యాన్ని మా మాతృభూమి నుంచి తరిమికొట్టి చరిత్ర సృష్టించాము. అందుకే అతడికి మాపై కోపం ఉంది. చనిపోయిన మా ముజాహిద్దీన్‌లు స్వర్గంలో ఉన్నారు. కానీ, దురాక్రమణ మిత్రులు నరకంలో కాలిపోతున్నారు. అతడు హెల్మాండ్‌లో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిజమైన చదరంగపు పావులు ఎలా ఉంటాయో చూపించాము’’ అని మౌల్వీ అఘా గోల్‌ పేర్కొన్నారు. 

ప్రిన్స్‌ హ్యారీ(Prince Harry) తన జీవితంపై ‘స్పేర్‌’ పేరిట ఆత్మకథ రాసుకొన్నారు.  బ్రిటన్‌ సైన్యంలో పనిచేస్తున్న సమయంలో అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో తాలిబన్లను వేటాడుతూ రెండు డజన్ల మందిని చంపినట్లు అందులో తెలిపారు. తాలిబన్లను సాధారణ పౌరులుగా చూడొద్దని బ్రిటన్‌ సైన్యం తనకు చెప్పిందని వివరించారు. తాను అంత మందిని చంపినందుకు గర్వపడటం గానీ, బాధపడటంలేదన్నారు. అపాచీ హెలికాప్టర్‌ పైలట్‌గా ఉన్న సమయంలో హ్యారీ ఈ దాడి చేసినట్లు పేర్కొన్నారు. 

2007-08 మధ్యలో  ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry)అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో బ్రిటిష్‌ రాయల్‌ ఆర్మీలో ఫార్వర్డ్‌ ఎయిర్‌ కంట్రోలర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2012-13 మధ్యలో అటాక్‌ హెలికాప్టర్‌ పైలట్‌గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు ఆపరేషన్లలో హ్యారీ పాల్గొన్నారు. తాము పోరాడుతున్న తాలిబన్లు కేవలం చదరంగంలో పావులే అని సైన్యం తనకు నూరిపోసిందని వివరించారు. ఈ పుస్తకంలో హ్యారీ వెల్లడించే విషయాల కారణంగా అతడి భద్రత ముప్పులో పడుతుందని బ్రిటన్‌ సైనిక నిపుణులు విమర్శించారు. 

 హక్కానీ గ్రూప్‌నకు చెందిన అనస్‌ హక్కానీ కూడా హ్యారీ పుస్తకంపై స్పందించాడు. ‘‘నువ్వు నిజం చెప్పావు. మీ సైన్యం, రాజకీయ నాయకులకు మా అమాయకపు ప్రజలు చదరంగంలో పావులు. ఆ చదరంగంలో మీరు ఓడిపోయారు. మానవ హక్కుల అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానం మిమ్మల్ని ప్రశ్నిస్తుందని నేను ఆశించను.ఏ మానవహక్కుల కార్యకర్త దీనిని ఖండించరు. ఈ అకృత్యాలు చరిత్రలో నిలిచిపోతాయనుకుంటున్నాను’’ అని హక్కానీ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు