Mullah Omar: 2001లో పూడ్చి.. ఇప్పుడు తవ్వితీసి! ఈ ‘తాలిబన్‌’ కారు వెనకున్న కథ ఇదే

తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ వాడిన ఓ కారును దాదాపు 21 ఏళ్ల తర్వాత తాజాగా భూమిలోంచి బయటకు తవ్వి తీశారు. 9/11 ఘటన తర్వాత అఫ్గానిస్థాన్‌పై అమెరికా బలగాలు జరిపిన దాడుల నుంచి తప్పించుకునేందుకుగానూ ఆయన ఇదే వాహనాన్ని...

Published : 08 Jul 2022 02:28 IST

కాబుల్‌: తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ వాడిన ఓ కారును దాదాపు 21 ఏళ్ల తర్వాత భూమిలో నుంచి బయటకు తవ్వి తీశారు. 9/11 ఘటన తర్వాత అఫ్గానిస్థాన్‌పై అమెరికా బలగాలు జరిపిన దాడుల నుంచి తప్పించుకునేందుకుగానూ ఆయన ఇదే వాహనాన్ని ఉపయోగించారు. ఈ తెల్లరంగు కారును తూర్పు అఫ్గానిస్థాన్‌ జాబుల్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామ సమీపంలో వెలికితీశారు. 2001లో తాలిబాన్ ‪నేత అబ్దుల్ జబ్బార్ ఒమారీ సమక్షంలో దీన్ని పూడ్చిపెట్టారు. తాజాగా ఆయన ఆదేశాల మేరకు దాన్ని తవ్వి తీశారు.

‘కారు ఇప్పటికీ మంచి కండిషన్‌లో ఉంది. దాని ముందు భాగం మాత్రమే కొంచెం దెబ్బతింది’ అని జాబుల్ ప్రావిన్స్ సమాచార, సంస్కృతిశాఖ డైరెక్టర్ రహ్మతుల్లా హమ్మద్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ వాహనాన్ని ఎవరూ ఎత్తుకెళ్లకుండా ఉండేందుకుగానూ.. 2001లో ఒమర్‌కు గుర్తుగా పాతిపెట్టారని చెప్పారు. ప్రస్తుతం ఈ కారును కాబుల్‌లోని జాతీయ మ్యూజియంలో చారిత్రక స్మారక చిహ్నంగా ప్రదర్శించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. చేతి పారలను ఉపయోగించి తవ్వి తీసిన కారు చిత్రాలను విడుదల చేశారు.

ముల్లా ఒమర్‌.. అఫ్గాన్‌లోని కాందహార్‌లో తాలిబన్‌ను స్థాపించారు. ఏళ్లపాటు అంతర్యుద్ధం తర్వాత 1998కల్లా తాలిబన్లు దేశాన్ని చాలావరకూ తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. ఇస్లామిక్‌ పాలన పేరిట కఠిన నిబంధనలు అమలు చేశారు. అమెరికాలో 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్, అల్ ఖైదాతోసహా అనేక తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇచ్చారు. అయితే, లాడెన్‌ను అప్పగించేందుకు నిరాకరించడంతో.. 2001 అక్టోబరు నుంచి అమెరికా, నాటో సేనలు దాడులు ప్రారంభించి తాలిబన్లను కూలదోశాయి. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాయి. దాడుల క్రమంలోనే ముల్లా ఒమర్.. ఈ కారులోనే కాందహార్ నుంచి తప్పించుకున్నాడని తాలిబన్ అధికారులు చెప్పారు. 2013లో అతను అజ్ఞాతంలో మృతి చెందాడు. అయినప్పటికీ.. అధికారులు అతని మరణాన్ని ఏళ్లపాటు రహస్యంగా ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని