మీడియా ముందుకు అఫ్గాన్‌ హోంమంత్రి.. తొలిసారి ఫొటోలు విడుదల

అమెరికా మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌.. హక్కానీ నెట్‌వర్క్‌ బాస్‌.. అఫ్గానిస్థాన్‌ హోంమంత్రిగా వ్యవహరిస్తున్న సిరాజుద్దీన్‌ హక్కానీ ముఖం తొలిసారి బాహ్య ప్రపంచానికి తెలిసింది.

Published : 05 Mar 2022 22:14 IST

కాబూల్‌: అమెరికా మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌.. హక్కానీ నెట్‌వర్క్‌ బాస్‌.. అఫ్గానిస్థాన్‌ హోంమంత్రిగా వ్యవహరిస్తున్న సిరాజుద్దీన్‌ హక్కానీ ముఖం తొలిసారి బాహ్య ప్రపంచానికి తెలిసింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. తాలిబన్ల ప్రభుత్వంలో తొలి బ్యాచ్‌ పోలీస్‌ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిరాజుద్దీన్‌ హక్కానీ బహిరంగంగా ప్రసంగించారు. దీనికి సంబంధించిన చిత్రాలను తాలిబన్‌ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఈ సందర్భంగా పౌరుల హక్కులు కాపాడతానంటూ హక్కానీ శాంతి వచనాలు పలకడం గమనార్హం.

పౌరుల పట్ల అమానవీయంగా వ్యవహరించిన తాలిబన్‌ సైనికులపై చర్యలు తీసుకుంటున్నట్లు సిరాజుద్దీన్‌ తెలిపారు. అలాగే, అంతర్జాతీయ సమాజం అఫ్గానిస్థాన్‌ను చూసి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశ పునరుద్ధరణకు విదేశీ సాయం అవసరం అని పేర్కొన్నారు. దోహా శాంతి ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అలాగే, స్వేచ్ఛగా మహిళలు చదువుకోవచ్చని, ఉద్యోగాలు చేయొచ్చని పేర్కొన్నారు. పోలీస్‌ శిక్షణ పూర్తి చేసుకున్న వారిలోనూ కొందరు మహిళలు ఉన్నారని పేర్కొన్న సిరాజుద్దీన్‌.. ఎంతమందన్నది మాత్రం వెల్లడించలేదు. అలాగే, అఫ్గాన్‌ను వీడిన వారంతా దేశానికి తిరిగి రావాలని పిలుపునిచ్చారు.

అమెరికాతో పాటు, ఐక్యరాజ్యసమితి కూడా సిరాజుద్దీన్‌ హక్కానీని ఉగ్రవాదిగా గుర్తించింది. కొన్నేళ్లుగా అమెరికా అతడి కోసం తీవ్రంగా గాలిస్తోంది. అఫ్గాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి కేసులోనూ హక్కానీ నిందితుడిగా ఉన్నాడు. గతంలో పలు సందర్భాల్లో మీడియా కంటపడినప్పటికీ పూర్తి ముఖం ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే తాలిబన్‌ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల తర్వాత హక్కానీ ఫొటోలు బయటకు రావడం గమనార్హం. మరోవైపు పాక్‌, చైనా మినహా అంతర్జాతీయ సమాజం ఏదీ.. తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. అలాగే, విదేశాల్లో అఫ్గాన్‌ కేంద్ర బ్యాంకు నిధులు స్తంభించిపోవడంతో తాలిబన్లకు ప్రభుత్వం నడపడం కష్టంగా మారింది. దీంతో నిధుల విడుదలకు వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అఫ్గాన్‌లో మహిళల హక్కులపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. సిరాజుద్ధీన్‌ హక్కానీ వారి విద్య, ఉద్యోగాల గురించి ప్రస్తావించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని