Ukraine Crisis: ‘పుతిన్‌తో మాట్లాడి ఉపయోగం లేదు.. టైం వేస్ట్‌’

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న వేళ ఆ వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.......

Published : 18 Apr 2022 02:15 IST

ఇటలీ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు

రోమ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న వేళ  వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై పోరును ముగించేందుకు పుతిన్‌తో మాట్లాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేలా పుతిన్‌తో పశ్చిమ దేశాలు ఇప్పటివరకు చేసిన దౌత్యపరమైన ప్రయత్నాలేవీ ఫలించలేదన్న డ్రాఘి.. ఆ నేతల మాటలను ఈ సందర్భంగా ఉటంకించారు. ‘పుతిన్‌తో చర్చల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇది కేవలం సమయం వృథా అని పశ్చిమ దేశాల నేతలు అన్నారు. దీని గురించి ఆలోచిస్తే వారు చెప్పింది నిజమే అని అనిపిస్తోంది’ అని ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రాఘి పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌ అస్తిత్వాన్ని సర్వనాశనం చేసేందుకే క్రెమ్లిన్‌ ఈ చర్య చేపట్టినట్లుగా ఉందని డ్రాఘి విమర్శించారు. ‘శాంతిని నెలకొల్పేందుకు పుతిన్‌ ఈ చర్య చేపట్టినట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. ఉక్రెయిన్‌ను దాడులతో నాశనం చేసి, దేశాన్ని హస్తగతం చేసుకునేలా ఈ చర్యలు సాగుతున్నాయి’ అని అన్నారు. ఉక్రెయిన్‌పై కొద్దిరోజుల్లోనే విజయం సాధిస్తామని క్రెమ్లిన్‌ భావించిందని పేర్కొన్న ఇటలీ అధ్యక్షుడు.. కానీ వారికి అది సాధ్యం కాలేదన్నారు.

ఇన్ని రోజులుగా చేస్తున్న ఈ పోరులో రష్యా విజయం సాధిస్తుందని కూడా తనకు నమ్మకం లేదని డ్రాఘి పేర్కొన్నారు. మాస్కో దాడులకు అడ్డునిలుస్తూ పోరాడుతున్న ఉక్రెయిన్‌ను ప్రశంసించారు. వారి ప్రతిఘటన వీరోచితమైనదని కొనియాడారు. కీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని సోమవారం నుండి తిరిగి ప్రారంభించనున్నట్లు ఇటలీ ప్రకటించిన అనంతరం డ్రాఘీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని