Earthquake: 248 గంటలు శిథిలాల కిందే.. ప్రాణాలతో బయటపడ్డ యువతి!

తుర్కియేలో భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవనం శిథిలాల్లోంచి ఏకంగా 248 గంటల తర్వాత సజీవంగా బయటపడిందో యువతి. తుర్కియే, సిరియాల్లో కలిపి ఇప్పటివరకు మృతుల సంఖ్య 42 వేలకు చేరుకుంది.

Published : 16 Feb 2023 22:45 IST

అంకారా: భారీ భూకంపం(Earthquake) ధాటికి తుర్కియే(Turkey), సిరియా(Syria)లు అతలాకుతలమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా విధ్వంస దృశ్యాలే! విపత్తు సంభవించి ఇప్పటికే వారానికిపైగా దాటడంతో శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులు ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 248 గంటల తర్వాత కూడా ఓ 17 ఏళ్ల యువతి సజీవంగా బయటపడ్డారు. తుర్కియేలోని కహ్రామన్మరాస్‌(Kahramanmaras)లో ఓ భవనం శిథిలాల్లో ఆమె ఆచూకీ లభ్యమైంది. ‘ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కళ్లు ఆడిస్తోంది’ అని సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు. ఈ నగరం భూకంప కేంద్రానికి సమీపంలో ఉంది.

‘వారం రోజులుగా ఈ భవనం శిథిలాలు తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాం. ఎవరైనా ప్రాణాలతో మిగిలి ఉన్నారేమోననే ఆశే మమ్మల్ని నడిపిస్తోంది. యువతి ప్రాణాలతో బయటపడటం సంతోషంగా ఉంది’ అని సిబ్బంది తెలిపారు. యువతి కుటుంబ సభ్యులు సైతం భావోద్వేగులయ్యారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలను భారీ భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో ఇరు దేశాల్లో భారీ సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. గురువారం నాటికి మృతుల సంఖ్య దాదాపు 42 వేలకు చేరింది. తుర్కియేలో 36 వేలకు పైగా, సిరియాలో 5800 మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని