Kim: కిమ్‌ దారుణాలు..వీడియోలు చూసినందుకు మరణశిక్ష..!

ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గడిచిన కొంతకాలంలో ఏడుగురికి బహిరంగ మరణశిక్ష విధించినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Updated : 22 Dec 2021 01:34 IST

దశాబ్ది పాలనలో కిమ్‌ దారుణాలపై తాజా నివేదిక

సియోల్‌: ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇటీవల ఏడుగురికి బహిరంగ మరణశిక్ష విధించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణకొరియాకు సంబంధించిన వీడియోలు చూడడం, వాటిని సరఫరా చేశారనే ఆరోపణలపై వారికి ఈశిక్ష అమలు చేసినట్లు తెలిపింది. ద.కొరియా పాప్‌ వీడియోలను ‘విషపు క్యాన్సర్‌’గా భావించే కిమ్‌, ఆ సంస్కృతిని ఉత్తరకొరియా దరిచేరకుండా ఉండేందుకేనని ఇలాంటి కఠినచర్యలు తీసుకున్నట్టు చెప్పుకున్నప్పటికీ.. ఇటువంటి దారుణాలకు పాల్పడడం పట్ల తాజా నివేదిక మండిపడింది.

‘కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాలనలో హత్యలు: అంతర్జాతీయ ఒత్తిడితో ఉత్తరకొరియా ప్రతిస్పందన’ పేరుతో సియోల్‌ కేంద్రంగా ఉన్న ట్రాన్సిషనల్‌ జస్టిస్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (TJWG) అనే మానవ హక్కుల సంస్థ తాజాగా ఓ అధ్యయనం జరిపింది. ముఖ్యంగా ఉత్తర కొరియాలో బహిరంగ మరణశిక్షలు ఎక్కడ ఎక్కువగా చేపడుతారు? ఆ మృతదేహాలను పూడ్చివేసే ప్రాంతాలను గుర్తించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా గత ఆరేళ్లలో ఉత్తరకొరియా నుంచి పారిపోయి వచ్చిన 683 మందిని ఇంటర్వ్యూ చేసింది. ఇలా కిమ్‌ ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన ఓ 23 హత్యలపై నివేదిక రూపొందించింది. వీరిలో ఎక్కువ మందిని సాయుధ బృందంతో కాల్చివేసినట్లు (ఫైరింగ్‌ స్క్వాడ్‌) టీజేడబ్ల్యూజీ నివేదిక వెల్లడించింది. మాదక ద్రవ్యాల సరఫరా, వ్యభిచారం, మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతోనూ మరికొందరికి మరణశిక్ష అమలుచేసినట్లు వెల్లడింది.

వీడియోలు చూసినందుకు ఏడుగురికి ఉరి..

అధికార పగ్గాలు చేపట్టిన దశాబ్దికాలం కాలం నుంచి దక్షిణకొరియా వినోద రంగంపై గుర్రుగా ఉన్న ఆయన.. అక్కడి పాప్‌ కల్చర్‌ను విషపు సంస్కృతిగా భావించారు. దక్షిణకొరియా పాటలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు ఉత్తర కొరియా ప్రజల మనసులను కలుషితం చేస్తాయన్న కిమ్‌.. వాటిని ఎవరైనా చూసినా, సరఫరా చేసినా మరణశిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చెప్పడమే కాకుండా ఆ ప్రయత్నం చేసిన వారికి బహిరంగ మరణశిక్ష అమలు చేశారు.

ఇలా దక్షిణకొరియాకు చెందిన సినిమా, పాప్‌ వీడియోలను విక్రయిస్తున్నాడనే నెపంతో ఈఏడాది మే నెలలో ఓ వ్యక్తికి ఉత్తరకొరియా అధికారులు మరణశిక్ష విధించారని దక్షిణకొరియా కేంద్రంగా నడుస్తోన్న ఓ ఆన్‌లైన్‌ పేపర్‌ వెల్లడించింది. తాజాగా టీజేడబ్ల్యూజీ పరిశోధనలోనూ ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ద.కొరియా వినోద కార్యక్రమాలున్న సీడీలు, డ్రైవ్‌లను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై 2012-2014 మధ్యకాలంలో ర్యాంగాంగ్‌ ప్రావిన్సులోని హైసన్‌కు చెందిన ఆరుగురికి మరణశిక్ష విధించినట్లు పేర్కొంది. మరో వ్యక్తికి ఉత్తర హాంగ్యాంగ్‌ ప్రావిన్సులోని చోంగ్‌జిన్‌ నగరంలో 2015లో మరణశిక్ష అమలు చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా కొన్నిసార్లు మరణశిక్ష అమలుచేసే సమయంలో వారి కుటుంబీకులకు బలవంతంగా చూపిస్తూ భయభ్రాంతులకు గురిచేసే దారుణాలకు కిమ్‌ అధికారులు పాల్పడినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలా కిమ్‌ పాలనలో ఇప్పటివరకు జరిగిన 23 హత్యలపై నివేదిక రూపొందించినట్లు ట్రాన్సిషనల్‌ జస్టిస్‌ వర్కింగ్‌ గ్రూప్‌ వెల్లడించింది.

హెచ్చరించేందుకే బహిరంగ శిక్ష..

అక్కడి చట్టాలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఇటువంటి చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించే లక్ష్యంతోనే కిమ్‌ ప్రభుత్వం ఈ దారుణాలకు పాల్పడిందని ట్రాన్సిషనల్‌ జస్టిస్‌ వర్కింగ్‌ గ్రూప్‌ పేర్కొంది. అయితే, అక్కడ జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు రావడంతో ఇటీవల మరణశిక్షలను గోప్యంగా చేపడుతున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు చెప్పింది. అంతర్జాతీయ పర్యవేక్షణ పెరగడంతో మానవ హక్కుల సమస్యలపై కిమ్‌ సామ్రాజ్యం ఎక్కువ దృష్టి సారించినట్లు అధ్యయన రూపకర్త పార్క్‌ అహ్-యోంగ్ పేర్కొన్నారు. దీనిర్థం ఇక్కడ మానవ హక్కుల పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కాదని.. ఇదివరకు జరిగినట్లు బహిరంగంగా కాకుండా కనిపించని మార్గాల్లో అధికారిక హత్యలు కొనసాగుతూనే ఉన్నాయని అహ్-యోంగ్ ఆరోపించారు. అంతేకాకుండా సరిహద్దులు, శాటిలైట్లు తేలికగా గుర్తించే ప్రాంతాల్లోనూ వీటిని అమలు చేయడం లేదన్నారు. అయితే, దేశంలో జైలు క్యాంపులు (Prison Camps) ఉన్నాయని వస్తోన్న వార్తలను ఉత్తర కొరియా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని