Vaccines: పేద దేశాలు టీకా డోసుల్ని తిరస్కరించాయి.. ఎందుకంటే..?

కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా అందిన 100 మిలియన్లకు పైగా టీకా డోసుల్ని పేద దేశాలు తిరస్కరించాయి. అసలే టీకా కొరతతో ఇబ్బంది పడుతున్న ఆ దేశాలు టీకాలు వద్దనడమేంటని ఆశ్చర్యపోవద్దు. అవన్నీ గడువు ముగియడానికి సిద్ధంగా ఉన్నవి కావడమే ఈ తిరస్కరణకు కారణం. గురువారం యూనిసెఫ్ ఈ విషయాన్ని వెల్లడించింది.

Published : 15 Jan 2022 01:52 IST

న్యూయార్క్‌: కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా అందిన 100 మిలియన్లకు పైగా టీకా డోసుల్ని పేద దేశాలు తిరస్కరించాయి. అసలే టీకా కొరతతో ఇబ్బంది పడుతున్న ఆ దేశాలు టీకాలు వద్దనడమేంటని ఆశ్చర్యపోవద్దు. అవన్నీ గడువు ముగియడానికి సిద్ధంగా ఉన్నవి కావడమే ఈ తిరస్కరణకు కారణం. గురువారం యునిసెఫ్ ఈ విషయాన్ని వెల్లడించింది.

‘గత నెల దాదాపు 100 మిలియన్ల డోసులు తిరస్కరణకు గురయ్యాయి’ అని యునిసెఫ్‌కు చెందిన ఎత్లేవా కడిల్లి వెల్లడించారు. స్వల్ప నిల్వ గడువుతో డోసుల్ని డెలివరీ చేయడమే ఈ తిరస్కరణకు కారణమని పేర్కొన్నారు. పేద దేశాలకు తగిన నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో డోసుల సరఫరాలో ఆలస్యం  చేయాల్సి వచ్చిందన్నారు. మొత్తంగా ఎన్ని డోసులు ఇప్పటివరకూ తిరస్కరణకు గురయ్యాయో మాత్రం యునిసెఫ్ వెల్లడించలేదు.

పబ్లిక్ డేటాబేస్ నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ సేకరించిన గణాంకాల ప్రకారం.. 681 మిలియన్ల షిప్పింగ్ డోసులు 90 పేద దేశాల్లో నిల్వ ఉన్నాయి. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజీరియాతో సహా 30కి పైగా దేశాలు తమకు అందిన వాటిల్లో సగం కంటే తక్కువ వాడినట్లు ఆ సంస్థ పేర్కొంది. గత త్రైమాసికంలో డెలివరీలు పెరగడంతో నిల్వలు పెరిగినట్లు గ్లోబల్ అలయెన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్‌ అండ్ ఇమ్యునైజేషన్ (గవి) ప్రతినిధి వెల్లడించారు. ఇటీవల డెలివరీ చేసిన టీకా డోసులకు నిల్వ గడువు ఎక్కువగా ఉందని, అవి వృథా అయ్యే అవకాశం ఉండదని చెప్పారు. కొవాక్స్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ 144 దేశాలకు 987 మిలియన్ల డోసుల టీకాలు పంపిణీ చేసినట్లు ఆ ప్రతినిధి తెలిపారు. 

ఇదిలా ఉండగా.. జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. సంపన్న దేశాలకు చెందిన 67 శాతం మంది పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు. పేద దేశాల్లో 8 శాతం మందికే మొదటి డోసు అందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని