Canada-India: కెనడా-భారత్‌ ఉద్రిక్తతలు.. విద్య, వాణిజ్యంపై ప్రభావమెంత..?

భారత దౌత్యవేత్తను కెనడా నిషేధించడం.. ఇటు భారత్‌ సైతం దీటుగా స్పందిస్తూ ఆ దేశ (Canada) రాయబారిపై వేటు వేయడంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు ఒక్కసారిగా మారిపోయాయి.

Updated : 19 Sep 2023 17:08 IST

దిల్లీ: భారత్‌ విషయంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన ప్రకటన.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది! భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడం.. ఇటు భారత్‌ సైతం దీటుగా స్పందిస్తూ ఆ దేశ (Canada) రాయబారిపై వేటు వేయడంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ తాజా పరిణామాలు ఇరు దేశాల పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలతో పాటు విద్యపై ఎలాంటి ప్రభావం చూపవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు అనేవి వాణిజ్య అంశాలపై ఆధారపడి ఉంటాయని.. అందుకే వాటిపై (Diplomatic relations) ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

విద్యార్థులపై ప్రభావమెంత..?

విద్య విషయంలో భారత్‌- కెనడాల మధ్య బలమైన సంబంధాలున్నాయి. ఇరుదేశాల మధ్య దాదాపు 200 విద్యాసంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. వీటికి అదనంగా 3.19 లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడాలో విద్యాసంస్థల్లో నమోదు చేసుకున్నారు. జీటీఆర్‌ఐ ప్రకారం.. కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల్లో మనవారే అత్యధికం. అక్కడ చదివే విదేశీ విద్యార్థుల్లో 20 శాతం భారతీయులే. కెనడా బ్యూరో ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకారం.. 2021లో కెనడా ఆర్థిక వ్యవస్థకు భారతీయ విద్యార్థుల ద్వారా మొత్తం 4.9 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.40వేల కోట్లు) సమకూరింది. ఇలా భిన్న రంగాల్లో ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు నెలకొన్న దృష్ట్యా ప్రస్తుత పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపకపోవచ్చని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ సహవ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు.

వాణిజ్యంలోనూ..

‘కెనడా, భారత్‌లు ఒకేరకమైన వస్తువుల తయారీలో పోటీ పడవు. అందుకే ఇరు దేశాల వాణిజ్య సంబంధం పెరుగుతుందే తప్ప.. రోజువారీ కార్యక్రమాలతో ప్రభావితం కావు’ అని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ సహవ్యవస్థాపకుడు అజయ్‌ పేర్కొన్నారు. ఇరుదేశాల పౌరుల మధ్య పెనవేసుకుపోయిన సంబంధాలు, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపకపోవచ్చన్నారు.

భారత్‌తో కెనడా విభేదాల వెనుక ఎవరు..?

కొన్నేళ్లుగా భారత్‌- కెనడాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరిగింది. 2022-23 నాటికి 8.16 బిలియన్‌ డాలర్లకు చేరింది. కెనడాకు ఫార్మా ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్‌ పనిముట్లను భారత్‌ ఎగుమతి చేస్తుంది. వీటి విలువు 4.1 బిలియన్‌ డాలర్లు. కాగా కెనడా నుంచి భారత్‌కు పప్పులు, కలప, కాగితం, మైనింగ్‌ ఉత్పత్తులు దిగుమతి అవుతాయి.

భారత్‌లో భారీ పెట్టుబడులు..

భారత్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల రాబడి వస్తున్నందున.. కెనడా పెన్షన్‌ నిధిని ఇక్కడ పెట్టుబడిగా పెడుతోంది. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, ఆర్థిక సేవల విభాగాల్లో భారీగా పెట్టుబడులు ఉన్నాయి. ఇలా 2022 చివరి నాటికి 45 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు అంచనా. కెనడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే నాలుగో దేశంగా భారత్‌ నిలుస్తోంది.

ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న తాజా పరిణామాలు ఆందోళన కలిగించేవేనని ముంబయి కేంద్రంగా పనిచేసే ఎగుమతిదారు, టెక్నోక్రాఫ్ట్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ శరద్‌ కుమార్‌ సరఫ్‌ అభిప్రాయపడ్డారు. ద్వైపాక్షిక వాణిజ్యమనేది పూర్తిగా వాణిజ్యపరమైన అంశాలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. రాజకీయ ఉద్రిక్తతలు తాత్కాలికమైనవేనని.. వాణిజ్య సంబంధాలు దెబ్బతీసేవిగా ఉండకూడదని అన్నారు. భారత్‌- చైనాల మధ్య సంబంధాలు క్షీణస్థాయిలో ఉన్నప్పటికీ.. ద్వైపాక్షిక వాణిజ్యం ఆరోగ్యకరంగా కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేశారు.

ఇదిలా ఉండగా.. జీ20 సదస్సు వేళ చోటుచేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాలు మాత్రం స్వేచ్ఛా వాణిజ్య సంప్రదింపులకు బ్రేకులు వేశాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ అవి తాత్కాలికంగా నిలిచిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు