Marijuana: థాయ్‌లాండ్‌లో గంజాయి సాగు ఇక చట్టబద్ధమే, కానీ..

మత్తు పదార్థమైన గంజాయిని సాగు చేయడం, వినియోగించడం భారత్ సహా అనేక దేశాల్లో నిషేధం. అయినప్పటికీ అక్రమంగా ఈ మొక్కల సాగు జరుగుతూనే ఉంది. తాజాగా  గంజాయిపై థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 10 Jun 2022 13:40 IST

అనుమతినిచ్చిన తొలి ఆసియా దేశం ఇదే

బ్యాంకాక్‌: మత్తు పదార్థమైన గంజాయిని సాగు చేయడం, వినియోగించడం భారత్ సహా అనేక దేశాల్లో నిషేధం. అయినప్పటికీ అక్రమంగా ఈ మొక్కల సాగు జరుగుతూనే ఉంది. తాజాగా గంజాయిపై థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగు, వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడం, ఎక్కువ మొత్తంలో వినియోగించడంపై మాత్రం నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

గంజాయి మొక్కలు, పువ్వులను నార్కోటిక్‌ డ్రగ్స్‌ కేటగిరీ నుంచి తొలగిస్తున్నట్లు థాయ్‌లాండ్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. ఇకపై అక్కడ గంజాయిని సాగు చేయడం, ఆహార పదార్థాల్లో, ఔషధాల్లో ఉపయోగించడం అధికారికమే. గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం ఇదే. వైద్య, పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం చెబుతోంది. అంతేగాక, శుక్రవారం నుంచి 10 లక్షల గంజాయి మొక్కలను ప్రభుత్వమే పంపిణీ చేయనుందట.

అలా చేస్తే భారీ జరిమానా..

వైద్య అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగును తాము ప్రోత్సహిస్తున్నామని థాయ్‌ ఆరోగ్య మంత్రి అనుటిన్‌ చార్న్‌ విరాకుల్‌ తెలిపారు. అంతేగాక, దీని సాగుతో దేశానికి పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో పాటు చిన్న రైతులకు ఉపాధి లభిస్తుందన్నారు. ‘‘సరైన అవగాహన ఉంటే.. గంజాయి బంగారం లాంటిది. చాలా విలువైనది’’ అని అనుటిన్‌ వ్యాఖ్యలు చేశారు. అయితే సరదా కోసం గంజాయిని వినియోగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగితే 3 నెలల జైలు శిక్షతో పాటు 780 డాలర్ల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అంతేగాక, ఆహార పదార్థాల్లో 0.2శాతం కంటే ఎక్కువ మొత్తంలో గంజాయి ఉండటం కూడా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. పర్యాటకులు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకుందో లేదో.. పలు రెస్టారెంట్లలో నిన్నటి నుంచే గంజాయితో తయారుచేసిన ఆహార పదార్థాల విక్రయాలు మొదలయ్యాయి. కొందరు గంజాయి మొక్కలతో సంబరాలు చేసుకున్నారు.

వీటిని మరిచారా..?

గంజాయిని చట్టబద్ధం చేయడంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంతో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. గంజాయి సాగును చట్టబద్ధం చేసిన థాయ్‌ ప్రభుత్వం.. దీని వినియోగంపై ఉన్న నిబంధనలపై స్పష్టత ఇవ్వలేదు. వినియోగంపై ఎలాంటి పరిమితులు ఉన్నాయి? గంజాయి సేవించి డ్రైవింగ్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే వాటిని ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. కేవలం ఓటర్లను దృష్టిలో ఉంచుకునే ఈ హడావుడి నిర్ణయం తీసుకుందని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.

ఇక, గంజాయి సాగుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడంతో పాటు, చిన్న రైతులకు లబ్ధి చేకూరుతుందని థాయ్‌ ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఆ ప్రయోజనాలు సమానంగా ఉంటాయా అన్న దానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజా నిర్ణయంతో కొన్ని పెద్ద కార్పొరేషన్లు దీని నుంచి అక్రమంగా లాభాలు ఆర్జించే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల చిన్న రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. గంజాయిని చట్టబద్ధం చేయడంతో ఆ నేరం కింద జైలుకు వెళ్లిన దాదాపు 4వేల మందిని త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడం గమనార్హం..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని