Thai Princess: కుప్పకూలిన థాయ్‌ యువరాణి.. గుండె సమస్యతో ఆసుపత్రిలో చికిత్స

థాయిలాండ్‌ యువరాణి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అక్కడి రాయల్‌ ఫ్యామిలీ ప్రకటించింది. పెంపుడు శునకాలకు శిక్షణ ఇస్తోన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారని తెలిపింద.

Published : 16 Dec 2022 06:17 IST

బ్యాంకాక్‌: థాయిలాండ్‌ యువరాణి (Princess) బజ్రకిటియభా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో భాగంగా పెంపుడు శునకాలకు శిక్షణ ఇస్తోన్న సమయంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండె సంబంధ సమస్యతో బాధపడుతూ స్పృహ తప్పిపడిపోయినట్లు సమాచారం. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం హెలికాప్టర్‌లో బ్యాంకాక్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువరాణికి చికిత్స అందుతోందని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని థాయ్‌ రాయల్‌ ప్యాలెస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

థాయిలాండ్‌ (Thailand) రాజు మహా వజిరలాంగ్‌కార్న్‌ (Maha Vajiralongkorn) మొదటి భార్య సోమ్‌సావాలి కుమార్తె బజ్రకిటియభా (44). అమెరికాలోని రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి న్యాయశాస్త్రంలో (పీజీ) పట్టా పొందారు. ఆ దేశ న్యాయ సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన ఆమె.. 2012-14లో ఆస్ట్రేలియాకు థాయిలాండ్‌ రాయబారిగా పనిచేశారు. అయితే, అధికారికంగా ప్రకటించనప్పటికీ.. థాయ్‌ రాజుకు కాబోయే వారసురాలు బజ్రకిటియభానే అని చెబుతుంటారు. తాజాగా ఆమె ఆరోగ్యంపై రాజకుటుంబం చేసిన ప్రకటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సీపీఆర్‌ చేసినప్పటికీ ఆమె స్పందించలేదని.. ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని