Earthquake: భారత్‌ ఆపన్న హస్తానికి కృతజ్ఞతలు : తుర్కియే భూకంప బాధితులు

కష్టకాలంలో తోడుగా ఉండి భారత సైనికులు అందిస్తున్న సేవలను తుర్కియే భూకంప బాధితులు కొనియాడుతున్నారు.

Updated : 12 Feb 2023 12:16 IST

అంటాక్యా : తుర్కియే, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 28వేలు దాటింది. క్షతగాత్రులను ఆదుకునేందుకు అక్కడి హతాయ్‌ ప్రావిన్స్‌లోని ఇస్కెండ్రన్‌లో ఏర్పాటు చేసిన 60 పారా ఫీల్డ్‌ ఆస్పత్రిలో భారతీయ ఆర్మీ విస్తృతంగా సేవలు అందిస్తోంది. 96 మంది భారతీయ వైద్య సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. కష్టకాలంలో భారత్‌ అందిస్తున్న ఆపన్న హస్తానికి తుర్కియే ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. భారత ఆర్మీ ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్‌కు ధన్యవాదాలు. కష్టకాలంలో మాకు తోడుగా ఉన్నందుకు అభినందనలు. భారత ఆర్మీ సిబ్బంది సేవలు పొందుతున్నందుకు సంతోషిస్తున్నామని’ చెప్పాడు. ఇటీవల ఓ తుర్కియే మహిళ సైన్యం అందిస్తున్న సహాయాన్ని మెచ్చి భారత సైనికురాలిని ముద్దాడగా ఆ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 

భారత ఆర్మీ తుర్కియేలోని హతాయ్‌ ప్రావిన్స్‌లో ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. భూకంపం సంభవించిన ఆరు గంటల్లోనే అక్కడ ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఇప్పటిదాకా నిరంతరాయంగా సేవలు అందుతున్నాయి. తాత్కాలిక ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆపరేషన్‌ థియేటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 800 మందికి చికిత్స అందజేసి.. వారి ప్రాణాలు కాపాడినట్లు భారత లెఫ్టినెంట్‌ కల్నల్‌ యదువీర్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. అవసరం ఉన్నన్ని రోజులు వైద్య సేవలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. భూకంప బాధితుల్లో 10 మందికి క్లిష్టమైన శస్త్ర చికిత్సలు కూడా చేసినట్లు మరో ఆర్మీ అధికారి తెలిపారు. 

తుర్కియే, సిరియాలో ఇప్పటిదాకా భూకంప మృతుల సంఖ్య 28వేలకు పైగా చేరుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు వణికించే మంచులోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా శిథిలాల్లోనే మగ్గిపోతున్న వారిని వేగంగా బయటకు తీసుకురాగలిగితేనే వారి ప్రాణాలు కాపాడగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రస్‌ అథనోమ్‌ వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని