Alfa Nero: రూ.990కోట్ల ‘దెయ్యం’ ఓడ.. మాకొద్దు మొర్రో అంటున్న ఆంటిగ్వా

SuperYatch Alfa Nero: రష్యాకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఓ లగ్జరీ ఓడ భారాన్ని ఆంటిగ్వా మోయలేకపోతోంది. నిర్వహణ ఖర్చును భరించలేక వేలానికి సిద్ధమైంది. ఇంతకీ ఆ ఓడ కథేంటీ?

Published : 20 May 2023 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అది ఓ లగ్జరీ ఓడ (SuperYatch). 267 అడుగుల పొడవు, 2500 టన్నుల బరువుండే ఈ భారీ నౌకలో స్విమ్మింగ్ పూల్‌, జిమ్‌, స్పా సెంటర్‌, ఎలివేటర్‌ ఇలా ఒక్కటేమిటి.. ప్రయాణికుల కోసం సకల సదుపాయాలున్నాయి. దీని ధర 120 మిలియన్‌ డాలర్లు.. అంటే ఎంతలేదన్నా రూ.990కోట్లకు పైమాటే..! కానీ, ఇది అంగుళం కదిలింది లేదు.. ప్రయాణికులను ఎక్కించుకుంది లేదు..! ఏడాది కాలంగా ఆంటిగ్వా (Antigua) తీరంలో లంగరేసుకుని ఉన్న ఈ ఓడను ఆ దేశం ఇక భరించలేకపోతోంది.. ఈ ‘దెయ్యం ఓడ’ మాకొద్దు మొర్రో అంటూ వాపోతోంది. ఇంతకీ ఆ నౌక ఒకే చోట ఎందుకు నిలిచిపోయింది..?ఆంటిగ్వా బాధకు కారణమేంటీ?

ఈ లగ్జరీ ఓడ పేరు ఆల్ఫా నీరో (Alfa Nero). రష్యా (Russia)కు చెందిన  ఓలిగార్క్‌ ఆండ్రీ గుర్యేవ్‌ (Andrey Guryev) దీని యజమానిగా తెలుస్తోంది. 2022 మార్చి ఆరంభంలో ఈ నౌక ప్రయాణికులతో పాటు ఆంటిగ్వా తీరానికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో రష్యా బలగాలు ఉక్రెయిన్‌ (Ukraine)లోకి చొరబడి సైనిక చర్యకు పాల్పడ్డాయి. ఈ దండయాత్రను తీవ్రంగా ఖండించిన పశ్చిమ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు అమలు చేసిన విషయం తెలిసిందే. అలా రష్యన్‌ ఓలిగార్క్‌ ఆండ్రీపైనా యూకే ఆంక్షలు విధించింది. దీంతో ‘ఆల్ఫా నీరో’ రాకపోకలు నిలిచిపోయాయి. ఆంక్షల నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో ఈ నౌకను ఆంటిగ్వా (Antigua) అధికారికంగా స్వాధీనం చేసుకుని తమ జెండాను ఏర్పాటు చేసింది. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కూడా నౌకపై ఉంచింది. ఎలాంటి రాకపోకలు లేకపోవడంతో ఇది ఘోస్ట్‌ షిప్‌గా మారిపోయింది. గతేడాది ఆగస్టులో అమెరికా (USA) ఈ నౌకలోని ఎఫ్‌బీఐ ఏజెంట్లను పంపి సోదాలు కూడా చేపట్టింది. అయితే ఈ నౌక తనది కాదని ఆండ్రీ చెప్పడం గమనార్హం.

ఏడాదిగా ఆరుగురు సిబ్బంది ఓడలోనే..

ఆంక్షలు విధించే సమయానికి ఇందులో 44 మంది సిబ్బంది ఉండేవారు. ఆ తర్వాత ఆ సంఖ్యను ఆరుగురికి తగ్గించారు. ఏడాదిగా వారు ఆ ఓడ (Alfa Nero)లోనే ఉన్నారు. అయితే ఇప్పటికీ నౌక ఏ మాత్రం చెడిపోలేదట. అందులో ఉన్న సిబ్బంది నిరంతరం దాన్ని శుభ్రం చేస్తూ కాపాడుతున్నారు. అయితే వారికి జీతాలు కూడా లేకపోవడం గమనార్హం. ఈ నౌకలోని 25 మంది సిబ్బంది తమకు వేతనాలు ఇవ్వలేదని కోర్టులో దావా వేశారు కూడా..!

నెలకు దాదాపు రూ.92లక్షల ఖర్చు..

ఈ లగ్జరీ ఓడను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆల్ఫా నీరో (Alfa Nero) నిర్వహణ బాధ్యత ఆంటిగ్వా మీద పడింది. ఈ నౌకను నిరంతరం జనరేటర్‌ తప్పనిసరి. దీని విలువైన చెక్క, లెదర్‌ ఇతర హైడిజైన్‌ ఇంటీరియర్స్‌ను రక్షించేందుకు 24 గంటలూ ఏసీలు నడవాల్సిందే. ఇక డోర్లు తెరవాలన్నా కరెంట్‌ తప్పనిసరి. దీంతో డీజిల్‌ వినియోగం ఎక్కువగా ఉంటోంది. సిబ్బంది భోజనం, ఇతరత్రా నిర్వహణ ఖర్చులు ఆంటిగ్వాకు తలకు మించిన భారంగా మారిపోయాయి. ప్రతి నెలా 1,12,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.92లక్షలు) ఖర్చవుతోందని ఆంటిగ్వా ప్రభుత్వం చెబుతోంది.

బ్లాక్‌లిస్ట్‌ తిప్పలు..

ఈ ఓడను విక్రయించేందుకు కూడా ఆంటిగ్వా (Antigua)కు వీలు లేకుండా పోయింది. ఆంక్షల నేపథ్యంలో ఆల్ఫా నీరోను అమెరికా బ్లాక్‌లిస్ట్‌ ఆస్తుల జాబితాలో చేర్చింది. ఒకవేళ దీని విక్రయం కోసం వేలం ప్రక్రియ చేపట్టినా.. బ్యాంకులు దీన్ని ఫ్రీజ్‌ చేసే ప్రమాదం ఉందట. అయినప్పటికీ ఆంటిగ్వా ఇటీవల బిడ్డింగ్‌ చేపట్టింది. ఇప్పటివరకు దాదాపు 20 బిడ్లు వచ్చాయని, ఆంక్షలు ఎత్తివేస్తే ఓడను వేలం వేస్తామని ఆంటిగ్వా ప్రభుత్వం అమెరికాను కోరుతోంది. అయితే దీనిపై అమెరికా నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాకపోవడం గమనార్హం..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని