School Shooting: అమ్మా.. నువ్వు తిరిగా రా..! నిన్ను గట్టిగా హత్తుకోవాలని ఉంది..!!

‘అమ్మా, నీ గొంతు వినాలని ఉంది. నిన్న హత్తుకోవాలనిపిస్తుంది. నువ్వు కావాలి. అంతా మునుపటిలా మారిపోవాలి. కానీ ఇదంతా సాధ్యం కాదు. నేను నిన్నెప్పటికీ చూడలేను’ అంటూ ఓ కూతురు మృతి చెందిన తన తల్లి కోసం ఆరాటపడుతోంది.

Published : 27 May 2022 01:48 IST

అమెరికా కాల్పుల ఘటన ఓ బిడ్డకు మిగిల్చిన చేదు జ్ఞాపకం

హ్యూస్టన్: ‘అమ్మా, నీ గొంతు వినాలని ఉంది. నిన్ను హత్తుకోవాలనిపిస్తుంది. నువ్వు కావాలి. అంతా మునుపటిలా మారిపోవాలి. కానీ ఇదంతా సాధ్యం కాదు. నేను నిన్నెప్పటికీ చూడలేను’ అంటూ ఓ కూతురు మృతి చెందిన తన తల్లి కోసం ఆరాటపడుతోంది. నువ్వు నా హీరో, నా స్ఫూర్తి అంటూ తనకు తానే ధైర్యం చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మంగళవారం తుపాకీ సృష్టించిన మారణహోమం.. ఓ బిడ్డకు మిగిల్చిన కన్నీటి జ్ఞాపకమిది. ఆ ఘటనలో ఫోర్త్‌ గ్రేడ్ టీచర్ ఎవా మిరెలెస్ మరణించారు. ఇప్పుడు ఆమె కూతురు గుండెకోతకు ప్రతి హృదయం ద్రవిస్తోంది..!

‘అమ్మా.. నాకు దుఃఖం పొంగుకొస్తోంది. ఈ బాధను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. ఇలాంటి ఒక పోస్టు పెట్టాల్సి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. నీ గొంతు వినాలని ఉంది. ఉదయాన్నే మమ్మల్ని లేపేందుకు నువ్వు వేసే కేకలు వినాలనిపిస్తోంది. నిన్ను ఒక్కసారి హత్తుకోవాలని ఉంది. నీతో అల్లరి చేయాలని ఉంది. నీ మీద కోప్పడాలని ఉంది. నీతో పాడాలని, ఆడాలని, నవ్వాలని ఉంది. ఇవన్నీ నాకు తిరిగి కావాలమ్మా. నువ్వు నా దగ్గరకు రావాలని ఉందమ్మా. నాకు ఎన్నో సంతోషాలను అందించావు. ఇప్పుడు నువ్వొక హీరోగా ప్రపంచానికి పరిచయం అయ్యావు. నువ్వు లేకుండా ఎలా ఉండాలో తెలియట్లేదు. కానీ నేను నాన్నను బాగా చూసుకుంటాను. నువ్వు పెంచుకునే కుక్కపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. చిన్నారులను కాపాడేందుకు మరణించిన అమ్మగా నిన్నెప్పుడూ స్మరించుకుంటాను. ధైర్యంగా జీవించేలా నన్ను ప్రోత్సహించావు. నాకొక స్ఫూర్తిగా నిలిచినందుకు థ్యాంక్యూ అమ్మా. నీ కూతురిగా గర్విస్తున్నా. అమ్మా.. నువ్వు నా హీరో’ అంటూ తన తల్లిని గుర్తుచేసుకుంటూ విలవిలలాడిపోయింది.

టెక్సాస్‌లోని యువాల్డీ పట్టణంలోని రాబ్‌ ప్రాథమిక పాఠశాలలో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 11.32 గంటలకు ఓ యువకుడు రక్షణ కవచం ధరించి వచ్చి ఏఆర్‌-15 సెమీ ఆటోమేటిక్‌ తుపాకీతో నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. ఆ ఘటన 19 మంది బడిపిల్లల్ని, ఇద్దరు టీచర్లను బలిగొంది. అనేకమంది గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు 5 నుంచి 10 ఏళ్ల లోపువారే. ఈ అమానుష ఘటన యావత్‌ ప్రపంచాన్ని కదిలించింది. ఎవా మరణాన్ని ఆమె సమీప బంధువు ధ్రువీకరించారు. తన విద్యార్థుల్ని కాపాడుకునే క్రమంలో ఎవా మరణించించారని ఆమె మీడియాకు వెల్లడించారు. 

ముష్కరుడిని అదే ప్రాంతానికి చెందిన సాల్వడార్‌ రామోస్‌గా గుర్తించారు. తన 18వ పుట్టినరోజున రెండు తుపాకులను కొని, స్కూల్లో కాల్పులకు కొద్దిసేపటి ముందు సొంత నానమ్మను కూడా కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. ఏ కారణంతో ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడనేది తెలియరాలేదు. గంటన్నరసేపు సాగిన మారణహోమం అనంతరం హంతకుడిని ఘటనా స్థలంలోనే పోలీసులు మట్టుబెట్టారు. టెక్సాస్‌ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన కాల్పుల ఘటన అని గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ అన్నారు. పాఠశాలలో తాను కాల్పులు జరపబోతున్న విషయాన్ని నిందితుడు రావోస్‌ ఆ ఘటనకు అరగంట ముందే ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు. నిందితుడికి నేరచరిత్ర లేదనీ, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా లేవని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని