Ukraine Crisis: ఎదురుదాడికి ఆయుధాలివ్వండి..!

రష్యాపై పోరాడేందుకు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను ఇవ్వాలని ఉక్రెయిన్‌ అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. ముఖ్యంగా మల్టిపుల్‌ లంఛ్‌ రాకెట్‌ వ్యవస్థ (ఎంఎల్‌ఆర్‌ఎస్‌)లను అందజేయాలని కోరుతోంది.

Updated : 27 May 2022 13:38 IST

రాకెట్‌ లాంఛర్ల కోసం ఉక్రెయిన్‌ పట్టు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాపై పోరాడేందుకు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను ఇవ్వాలని అమెరికాపై ఉక్రెయిన్‌ ఒత్తిడి తెస్తోంది. ముఖ్యంగా మల్టిపుల్‌ లాంఛ్‌ రాకెట్‌ వ్యవస్థ (ఎంఎల్‌ఆర్‌ఎస్‌)లను అందజేయాలని కోరుతోంది. డాన్‌బాస్‌పై రష్యా దాడులను తట్టుకోవాలంటే ఇవి తప్పనిసరి. ఇప్పటికే పశ్చిమ దేశాలు ఎం777 హోవిట్జర్లను ఉక్రెయిన్‌కు సరఫరా చేశాయి. వాటిని తూర్పు ఉక్రెయిన్‌లో పోరాటానికి ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఆర్‌ఎస్‌ల కొనుగోళ్లపై దృష్టిపెట్టారు. పూర్తిగా మైదాన ప్రాంతమైన డాన్‌బాస్‌లో జరిగే పోరాటంలో ఇప్పటికే అమెరికా అందించిన శతఘ్నులు రష్యన్లను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోపక్క అమెరికా మల్టిపుల్‌ లాంఛ్‌ రాకెట్‌ వ్యవస్థలను అందించేందుకు వెనుకాడుతోంది.

అసలు ఆ ఎంఎల్‌ఆర్‌ఎస్‌లు ఏంటి..?

ఈ రాకెట్‌ లాంఛర్లు వాహనాలపై అమర్చి ప్రయోగిస్తారు. ఒక సారి దాడి చేశాక.. శత్రువు పసిగట్టి ఎదురు దాడి చేయకుండా.. అక్కడి నుంచి వేగంగా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అమెరికా వద్ద  ఎం270, ఎం142 రకం లాంఛర్లు ఉన్నాయి. వీటిల్లో ఎం270ను 1983లో అభివృద్ధి చేశారు. ఇది అత్యధికంగా 40 మైళ్ల దూరంలోని టార్గెట్‌ను ఛేదిస్తుంది. దీనిలో అత్యాధునిక వేరియంట్‌ రాకెట్లు 100 మైళ్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలవు.

ఇక ఎం142 వేరియంట్‌ రకాన్ని 1990ల్లో అభివృద్ధి చేశారు. దీనిలోని స్టాండర్డ్‌ రాకెట్లు 186 మైళ్ల దూరంలోని లక్ష్యాలను.. ప్రత్యేకమైన రాకెట్లు 310 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.

ఇప్పుడు ఎందుకు..?

డొనెట్స్క్‌లోని చాలా ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ స్థావరాలపై రష్యా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాము ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్‌ ప్రభుత్వం పేర్కొంది. దీనికి నాటో ఉపయోగించే ఎంఎల్‌ఆర్‌ఎస్‌లు అవసరమని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా డిఫెన్స్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ ట్విటర్‌ హ్యాండిల్‌ పోస్టు చేసింది. 

ఇప్పటికే ఉక్రెయిన్‌ వద్ద సోవియట్‌ కాలం నాటి కొన్ని రాకెట్‌ లాంఛింగ్‌ వ్యవస్థలు ఉన్నాయి. కానీ, వాటిల్లో వినియోగించే రాకెట్లు కేవలం రష్యాలోనే తయారు చేస్తారు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. ఇప్పుడు ఆ లోపాన్ని అమెరికా రాకెట్‌ లాంఛర్లతో భర్తీ చేస్తే.. రష్యా పొజిషన్లపై కీవ్‌ దాడులు చేయవచ్చు. అత్యాధునిక రాకెట్లను కనుక అమెరికా సమకూరిస్తే.. రష్యాలోని సప్లై నెట్‌వర్క్‌ను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది.

నల్లసముద్రంలో పట్టు కాపాడుకోవచ్చు..

ఈ దీర్ఘశ్రేణి రాకెట్‌ లాంఛర్లు ఉక్రెయిన్‌ను నల్లసముద్రంలో కూడా కాపాడతాయి. క్రిమియా, నల్లసముద్రంలోని ఇతర ప్రాంతాల నుంచి రష్యా దాడి చేసే ప్రదేశాలను గుర్తించి.. ప్రతిదాడి చేయవచ్చు. దీర్ఘశ్రేణి ఆయుధాలు తమకు ఎంతో అవసరమని ఉక్రెయిన్‌ రక్షణశాఖ ప్రతినిధి రెఝెనఖో పేర్కొన్నారు.

వెనుకాడుతున్న అమెరికా..

రాకెట్‌ లాంఛర్లను ఉక్రెయిన్‌కు ఎగుమతి చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదు. ఎంఎల్‌ఆర్‌ఎస్‌లతోపాటు దీర్ఘశ్రేణి ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందిస్తే.. దానిని కవ్వింపుచర్యగా రష్యా భావించే ప్రమాదం ఉందని అమెరికా సంకోచిస్తోంది. ఈ యుధంలోకి నాటో ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించకూడదని మిత్రదేశాలు మొదటి నుంచి ఒత్తిడి చేస్తున్నాయి. దీనిపై అమెరికా సెనెటర్‌ పోర్టమన్‌ స్పందిస్తూ.. ‘‘మేము వారికి అవసరమైన ఆయుధాలు ఇస్తున్నామని ముందు నిర్ధారించుకోవాలి. ఇప్పుడు వారు ఎంఎల్‌ఆర్‌ఎస్‌లు అడుగుతున్నారు’’ అని పేర్కొన్నారు. మరోపక్క పశ్చిమ దేశాల నుంచి నిలకడగా ఆయుధాలు అందుతున్నా.. కీవ్‌ ఈ వ్యవస్థలపై ఆశలు పెట్టుకొంది. వాషింగ్టన్‌ కూడా వీటిని కీవ్‌కు చేర్చే మార్గాలను పరిశీలిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని