Indonesia: సూర్యోదయం చూద్దామని వెళితే పాడు పనులు ఎదురవుతున్నాయి..

ఇండోనేషియాలోని బాలి పర్యాటక ప్రాంతంలో సూర్యోదయం చూద్దామని వెళ్లేవారికి పాడు పనులు ఎదురవుతున్నాయి. ఇక్కడి పవిత్ర పర్వతాలపై విదేశీ టూరిస్టుల అసభ్య ప్రవర్తన ఘటనలు స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

Published : 12 Feb 2023 00:59 IST

బాలి: ఇండోనేషియా(Indonesia)లోని బాలి(Bali) ద్వీపంలో పర్యాటకం(Tourism) ముసుగులో కొందరు పర్యాటకులు చేస్తున్న అరాచకాలు స్థానికులకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. బాలి ద్వీపంలో 90 శాతం వరకు హిందువులే కావడం విశేషం. దీవిలోని పలు పర్వతాలను పవిత్రంగా పూజిస్తారు. ఈ పర్వతాలను దేవతలు, తమ పూర్వీకులు ఉండే ప్రాంతాలుగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే, ఇవేమీ పట్టించుకోని ఇతర దేశాల టూరిస్టులు(Foreign tourists)  చేస్తున్న పాడు పనులు తమ సంప్రదాయాలను, విశ్వాసాలను ఘోరంగా అవమానిస్తున్నాయని వాపోతున్నారు.

ఏం జరిగింది?

బాలిలో హిందువులు పవిత్రంగా భావించే బాటుర్‌ శిఖరం(Mount Batur)తో పాటు ఇతర పర్వతాలకు టూరిస్టుల తాకిడి పెరిగింది. ఇక్కడి నుంచి సూర్యోదయ దృశ్యాలను చూసేందుకు స్థానికులతోపాటు వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. అయితే, విదేశీ టూరిస్టులు ఈ పర్వతాలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. పర్వతాలపై వారంతా సమూహంగా చేరడం, కొందరు నగ్నంగా నృత్యాలు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే నగ్నంగా నృత్యాలు చేయడంతో కెనడా పర్యాటకుడిని బలవంతంగా వెనక్కు పంపించివేశారు. రష్యాకు చెందిన ఓ నటి అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలు వెలువడ్డాయి.

అవి పవిత్ర పర్వతాలు..

ఈ వ్యవహారంపై స్పందించిన బాలి గవర్నర్‌ కొత్త నియమావళిని జారీ చేశారు. పర్వతాలను పవిత్రమైనవిగా గుర్తించడంతోపాటు వాటి పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. బాలిలో పర్వతాలపై దూషణలు చేస్తే వాటిని నేరంగానే పరిగణిస్తారు. పర్యాటకులు స్థానిక సంప్రదాయాలను గౌరవించడంతోపాటు స్థానిక చట్టాలను పాటించాలని అధికారవర్గాలు విజ్ఞప్తి చేశాయి. అన్ని చట్టాలను పాటిస్తామని హామీ ఇస్తేనే వారిని బాలిలోకి అనుమతించాలని స్థానికులు సూచించారు. పర్యాటక రంగంపై ఆధారపడి వున్న వారి జీవనభృతికి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్థానిక అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు