Ukraine Crisis: కల్లలైన కలలను తల్చుకుంటూ.. వైరల్‌గా ఉక్రెయిన్‌ విద్యార్థిని చిత్రం..!

విద్యాసంవత్సరం చివరకు వస్తున్నారంటే.. పరీక్షలు, ఉన్నత చదువులతో పాటు స్నేహితులతో చివరగా జరుపుకునే సెండాఫ్ పార్టీ విద్యార్థుల మదిలో మెదులుతుంటుంది.

Published : 10 Jun 2022 01:47 IST

కీవ్‌: విద్యాసంవత్సరం చివరకు వస్తుందంటే.. పరీక్షలు, ఉన్నత చదువులతో పాటు స్నేహితులతో చివరగా జరుపుకునే సెండాఫ్ పార్టీ విద్యార్థుల మదిలో మెదులుతుంటుంది. కానీ ఉక్రెయిన్‌లో రష్యా చేస్తోన్న దురాక్రమణ.. పిల్లల ఆశలు, ఆనందాలను దూరం చేస్తోంది. ఈ దాడి విద్యారంగంపై కూడా పెను ప్రభావాన్ని చూపుతోంది. పుతిన్‌ సేనలు విద్యాసంస్థలను నేలమట్టం చేయడంతో ఎందరో చదువుకు దూరమయ్యారు. ఇలాగే హైస్కూల్ విద్యను పూర్తి చేసి, చివర్లో తన స్నేహితులతో వేడుక చేసుకునే రోజు కోసం ఎదురుచూసింది ఓ టీనేజర్. ఇంతలో దాడికి దిగిన రష్యన్లు ఆ కలలను కల్లలు చేశారు. వాటిని తలుచుకుంటూ తాను సిద్ధం చేసుకున్న డ్రెస్‌తో పాఠశాల శిథిలాల ముందు ఫొటో దిగింది. ఇప్పుడు ఆ చిత్రం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

‘నా మేనకోడలు ఈ ఏడాది తన హైస్కూల్ విద్యను పూర్తి చేయాల్సి ఉంది. ముగింపు వేడుకకోసం తనతో పాటు తన స్నేహితులు దుస్తులు కొనుగోలు చేసుకున్నారు. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో రష్యన్లు వచ్చారు. ఆమె చదువుతోన్న పాఠశాలపై దాడి చేసి, నేలమట్టం చేశారు. కానీ ఈ రోజు తాను సిద్ధం చేసుకున్న డ్రెస్‌తో ధ్వంసమైన తన పాఠశాల, కలలను తల్చుకుంటూ పాఠశాల ముందు నిల్చొని ఉంది’ అంటూ ఈ టీనేజర్ బంధువు ఒలెక్సాండ్రా ట్వీట్ చేశారు. అందులో ఆ విద్యార్థిని ఎరుపు రంగు గౌనులో విచార వదనంతో దర్శనమిచ్చింది. దీనిపై నెటిజన్లు కామెంట్లతో స్పందించారు. ‘అద్భుతమైన చిత్రం. ఉక్రేనియన్ల ధైర్యం అమోఘం’, ‘వారెంత దృఢమైన వారో ఈ చిత్రం చెప్తోంది. వీరిపై పుతిన్ ఎలా విజయం సాధించగలరు?’ అంటూ పోస్టులు పెడుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని