Ukraine Crisis: రష్యా వాడుతున్న ఆయుధాలివే..

క్రెయిన్‌ నగరాలపై రష్యా దాడుల చిత్రాలు, వీడియోలతో సోషల్‌ మీడియా నిండిపోయింది. ఈ క్రమంలో రష్యా భారీ సంఖ్యలో ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకోసం విమానాలు, క్షిపణులు, శతఘ్నులను, పదాతి దళాలను

Updated : 25 Feb 2022 12:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దాడుల చిత్రాలు, వీడియోలతో సోషల్‌ మీడియా నిండిపోయింది. ఈ క్రమంలో రష్యా భారీ సంఖ్యలో ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకోసం విమానాలు, క్షిపణులు, శతఘ్నులను, పదాతి దళాలను ఒక ప్యాకేజీలా వాడి ఉక్రెయిన్‌ను దెబ్బతీసింది. ఈ క్రమంలో నిన్నటి వరకూ మొత్తం 80 స్థావరాలను ధ్వంసం చేసింది. రష్యా వాడిన ఆయుధాలివే..

శతఘ్నులు.. క్షిపణులు..

ఉక్రెయిన్‌ సరిహద్దుల సమీపంలోనే అసెంబ్లింగ్‌ చేసిన స్వల్ప, మధ్య శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులు, క్రూజ్‌ క్షిపణులు, శక్తిమంతమై శతఘ్నులు వినియోగించి ప్రభుత్వ భవనాల వంటి వాటిని లక్ష్యంగా చేసుకొన్నాయి. రష్యా దళాలు మొత్తం 160 క్షిపణులను ఉక్రెయిన్‌లోని లక్ష్యాలపై ప్రయోగించాయి. వీటిల్లో కల్బిర్‌ క్రూజ్‌ క్షిపణులు, సికిందర్‌ టాక్టికల్‌ బాలిస్టిక్‌ క్షిపణులు ఉన్నాయి. దీంతోపాటు క్రూజ్‌ క్షిపణులు, సముద్రంపై నుంచి దాడి చేసే క్షిపణలు, విమానాలపై నుంచి ప్రయోగించే క్షిపణులను వినియోగించినట్లు అమెరికా రక్షణ శాఖ వర్గాలు అంచనా వేశాయి.  దీంతోపాటు స్మెర్చ్‌ రాకెట్‌ లాంఛర్లను కూడా వాడినట్లు ఉక్రెయిన్‌లో దొరికిన శకలాలు చెబుతున్నాయి. ఒక ట్రక్‌పై నుంచి 38 క్షణాల్లో 12 రౌండ్ల స్మెర్చిలను పేల్చగలదు. కాకపోతే వీటిపై లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే గైడెడ్‌ వ్యవస్థ ఉండదు.  వీటితోపాటు ఉర్గాన్‌ మల్టీ రాకెట్‌ లాంచర్లను కూడా వినియోగించినట్లు భావిస్తున్నారు.

75 విమానాలు వాడి..

ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌ను చుట్టుముట్టిన తర్వాత రష్యా ప్రత్యేక విమానాలను కూడా సరిహద్దుల సమీపంలోకి తీసుకొచ్చింది. ఇవి క్లస్టర్‌ బాంబులు, పెద్ద ఎత్తున లోహపు తునకలు వెదజల్లే ఫ్రాగ్మెంటేషన్‌ బాంబులను ప్రయోగించగలవు. వీటితోపాటు గగనతలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో దాడి చేయగలవు. ఇలాంటివి మొత్తం 75 విమానాలను ఉక్రెయిన్‌పై దాడికి వాడినట్లు అమెరికా రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు. దీంతోపాటు కీవ్‌ వైపు దాదాపు రెండు డజన్ల ఎంఐ-8 హెలికాప్టర్లను కూడా వినియోగించారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి, మందుగుండు గోదాములను పేల్చి వేయడానికి వినియోగించారు. దీంతోపాటు కీవ్‌ వద్ద కొన్ని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లను కూడా ధ్వంసం చేశారు.

గ్రౌండ్‌ వెహికల్స్‌..

రష్యా భారీ ఎత్తున సాయుధ వాహనాలు, ట్యాంకులను ఈ దాడికి వాడింది. ఈ క్రమంలో ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న గ్లుఖోవ్‌ వద్ద అమెరికా సరఫరా చేసిన జావెలిన్‌ క్షిపణితో ఓ టి-72 ట్యాంక్‌ను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసిన చిత్రాలూ వెలుగులోకి వచ్చాయి. దీనికి తోడు రష్యాకు చెందిన చాలా వాహనాలు తమ గుర్తింపు తెలిసే విధంగా  ప్రత్యేక ఏర్పాటు చేసుకొని ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని