Updated : 07 Jul 2022 18:28 IST

Boris Johnson: వివాదాల బోరిస్‌ జాన్సన్.. ‘బ్రిటన్‌ డొనాల్డ్‌ ట్రంప్‌’..!

ఇంటర్నెట్‌డెస్క్‌: పొరబాటు ఆయనకు అలవాటు.. తప్పు బయటపడితే క్షమాపణ పరిపాటి.. అదే ఆయన మెడకు గట్టిగా చుట్టుకుంది. ఇప్పుడు పదవీచిత్యుడిని చేసింది. ఆయనే బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జాన్సన్‌కు స్వపక్షం నుంచే అవిశ్వాసం ఎదురైంది. గత్యంతరం లేక ప్రధాని పీఠం నుంచి దిగిపోయారు. బ్రెగ్జిట్‌ హీరోగా పేరుతెచ్చుకున్న జాన్సన్‌ 2019 జులై 24న తొలిసారిగా దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. వివాదాలతోనే పాలనా పగ్గాలను దక్కించుకున్న ఆయన.. ప్రధానిగానూ ఎన్నో ‌సార్లు విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పినప్పటికీ ఆ అపకీర్తిని పోగొట్టుకోలేకపోయారు.

విరాళాలతో ఇంటికి మెరుగులద్దుకుని..

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత బోరిస్‌ జాన్సన్‌ డౌనింగ్‌ స్ట్రీట్‌లోని తన నివాసంలో కొన్ని మార్పులు చేయించుకున్నారు. సెలబ్రిటీ డిజైనర్లతో ఇంటిని రీమోడలింగ్‌ చేశారు. తన ఇంట్లో ఓ గోడకు బంగారు వాల్‌పేపర్‌ అతికించారట కూడా. అయితే ఇందులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. బ్రిటిష్‌ మీడియా ప్రకారం ఈ హంగులకు 2లక్షల యూరోల వరకు ఖర్చయ్యిందట. అయితే ఈ ఖర్చుల కోసం ఆయన కన్జర్వేటివ్‌ పార్టీ దాత నుంచి విరాళం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు రావడం కలకలం రేపింది. అందుకు సంబంధించిన వాట్సాప్‌ మెసేజ్‌లు కూడా బయటకు వచ్చాయి. యూకే నిబంధనల ప్రకారం.. 7500 యూరోల కంటే ఎక్కువ మొత్తంలో రాజకీయ విరాళాలు, రుణాలు తీసుకుంటే ఆ వివరాలను బహిర్గతపర్చాలి. అయితే జాన్సన్‌ తీసుకున్న విరాళాలు బయటకు రాకపోవడంతో అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఇందుకుగానూ ఎన్నికల కమిషన్‌.. కన్జర్వేటివ్‌ పార్టీకి 17800 యూరోల జరిమానా కూడా విధించింది.

లాబీ కుంభకోణం..

బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఓవెన్‌ పాటెర్సన్‌ కొన్ని కంపెనీల తరఫున లాబీయింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై పార్లమెంట్‌ స్టాండర్డ్స్‌ కమిటీ 30 రోజుల సస్పెన్షన్‌ విధించింది. అయితే ఈ సస్పెన్షన్‌ను అడ్డుకునేందుకు జాన్సన్‌ విపరీతంగా ప్రయత్నించారు. ఇది ఆయనపై విమర్శలకు దారితీసింది. ఇది కాస్తా తీవ్ర దుమారం రేగడంతో పాటెర్సన్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం పాటెర్సన్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

పార్టీ గేట్‌ వివాదం..

కరోనాతో యావత్ ప్రపంచం లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో బోరిస్‌ జాన్సన్‌ గతేడాది ఏప్రిల్‌లో తన అధికారిక నివాసంలో సహచరులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం తీవ్ర వివాదానికి దారితీసింది. అదే సమయంలో బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణించారు. దేశమంతా ఆ విషాదంలో ఉండగా.. జాన్సన్‌ ఇలా నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకోవడం దుమారం రేపింది. ఇందుకు గానూ ఆయనకు పోలీసులు జరిమానా వేయడంతో పాటు బ్రిటన్‌ రాణికి జాన్సన్‌ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో పార్లమెంట్‌ ఇంకా దర్యాప్తు జరుపుతోంది.

‘పించర్‌’ ఎఫెక్ట్‌..

ఈ ఏడాది ఫిబ్రవరిలో జాన్సన్‌.. క్రిస్‌ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా నియమించారు. అప్పటికే అతని నడవడికకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్‌ పట్టించుకోకుండా క్రిస్‌ పించర్‌ను కీలకమైన పదవిలో కూర్చోబెట్టారు. ఇటీవల ఒక క్లబ్‌లో తాగిన మత్తులో క్రిస్‌ పించర్‌ ఇద్దరు పురుషుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. అతను ఇలాంటి వాడని తనకు తెలియదని ప్రధాని బోరిస్‌ తెలపడం... పించర్‌ గురించి తాము ముందే నివేదించామని మాజీ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించడంతో వివాదం కీలక మలుపు తిరిగింది. దీంతో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు క్షమాపణలు కోరారు. ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో బోరిస్‌ జాన్సన్‌పై విశ్వాసం కోల్పోయిన మంత్రులు రిషి సునాక్‌, సాజిద్‌ జావిద్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత వరుసగా మంత్రుల రాజీనామాలు కొనసాగాయి.

మంత్రులపై లైంగిక వేధింపుల ఆరోపణలు..

ఇవన్నీ చాలవన్నట్లు కన్జర్వేటివ్‌ పార్టీలో అనేక మంది ఎంపీలు లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఓ 15 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించారన్న కేసులో ఎంపీ ఇమ్రాన్‌ అహ్మద్‌ ఖాన్‌ దోషిగా తేలడంతో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో కన్జర్వేటివ్‌ ఎంపీ నీల్‌ పరీష్‌.. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభలో నీలి చిత్రాలు చూడటం దుమారం రేపింది. అత్యాచారం, ఇతర నేరాల కింద ఓ కన్జర్వేటివ్‌ ఎంపీ అరెస్టయ్యారు. బాధితురాలి భద్రతా కారణాల దృష్ట్యా అతడి పేరు బయటకు రాలేదు.

బ్రెగ్జిట్‌ హీరోగా పేరొంది..

దాదాపు ఐదు దశాబ్దాల బంధానికి స్వస్తిపలుకుతూ ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగడానికి నిర్వహించిన ‘బ్రెగ్జిట్‌’ రెఫరండంలో ప్రజలు 2016లోనే తీర్పు చెప్పినా.. అందుకు సంబంధించిన ఒప్పందం ఖరారు కావడంలో పార్లమెంటులో జాప్యం జరిగింది. మూడు దఫాలు బ్రెగ్జిట్‌ బిల్లు చట్టసభల ముందుకు వచ్చినా.. ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదరకపోవడంతో ప్రతిసారి వీగిపోయింది. ఈ క్రమంలో నాటి ప్రధాని థెరెసా మే రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బోరిస్‌ జాన్సన్‌ అతికష్టం మీద బ్రెగ్జిట్‌ బిల్లుకు జనవరి 10న పార్లమెంటు ఆమోదం లభింపజేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. దీంతో జాన్సన్ బ్రెగ్జిట్‌ హీరో అయ్యారు. 2020లో ఈయూ నుంచి బ్రిటన్‌ అధికారికంగా వేరుపడిన సందర్భంగా జాన్సన్‌ మాట్లాడుతూ.. ‘నవశకానికి నాంది’గా అభివర్ణించారు. అయితే దీనిపై కొన్ని వర్గాల నుంచి జాన్సన్‌కు వ్యతిరేకత కూడా ఎదురైంది.

జాన్సన్‌ రాజకీయ జీవితంలో ఆది నుంచి ఇలాంటి వివాదాలెన్నో. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై ఎన్ని వివాదాలున్నాయో.. జాన్సన్‌పైనా అదే స్థాయిలో ఉన్నాయి. అందుకేనేమో.. ఆయన్ను ‘బ్రిటన్‌ డొనాల్డ్‌ ట్రంప్‌’గా అభివర్ణిస్తుంటారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని