Russia: ఐరాస భద్రతామండలి నుంచి.. రష్యాను తొలగించేందుకు సిద్ధం!

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యాను ఆ స్థానం నుంచి తొలగించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు బ్రిటన్‌ పేర్కొంది.

Published : 01 Mar 2022 22:28 IST

మార్గాలను అన్వేషిస్తున్నామన్న బ్రిటన్‌

లండన్‌: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌లో దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవైపు ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతూనే మరోవైపు రష్యాపై చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యాను ఆ స్థానం నుంచి తొలగించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు బ్రిటన్‌ పేర్కొంది. ఉక్రెయిన్‌ విషయంలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతోన్న రష్యాను యూఎన్‌ఎస్‌సీ నుంచి తొలగించేందుకు బ్రిటన్‌ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉన్నాయి. వీటిలో చైనా, ఫ్రాన్స్‌, రష్యా, అమెరికాతో పాటు బ్రిటన్‌ దేశాలు శాశ్వత సభ్యదేశాలు. మరో పది సభ్యదేశాలు కాని వాటిని రెండేళ్ల కాలపరిమితితో సాధారణ సభ ఎన్నుకుంటుంది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తూ ఐరాస భద్రతా మండలిలో ఇటీవల ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఓటింగ్‌కు భారత్‌తో పాటు చైనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లు దూరంగానే ఉండిపోయాయి. మండలిలో మొత్తం 15 సభ్య దేశాలుండగా, తీర్మానానికి అనుకూలంగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, మెక్సికో తదితర 11 దేశాలు ఓటు వేశాయి. ఈ తీర్మానాన్ని రష్యా వీటో ద్వారా అడ్డుకొంది. రష్యా మిత్రదేశంగా ఉండి, వీటో అధికారమున్న చైనా మాత్రం దాన్ని ఉపయోగించకుండా, ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఇలా భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశానికి ఉన్న అధికారాల దృష్ట్యా.. రష్యాపై కీలక చర్యలు తీసుకోవడంలో భాగంగా బ్రిటన్‌ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని