Thailand: థాయ్‌లాండ్‌ పిలుస్తోంది.. ‘తేలియాడే రైలు’ రమ్మంటోంది

థాయ్‌లాండ్‌లో ఎంతో ప్రత్యేకమైన తేలియాడే రైలు ప్రయాణం ప్రారంభమైంది. నవంబరు- ఫిబ్రవరి మధ్య వారాంతాల్లో మాత్రమే నడిమే ఈ రైలు ప్రయాణానికి పర్యాటకులు పొటెత్తుతున్నారు. ఇప్పటికే జనవరి వరకు టికెట్లు అమ్ముడు పోయాయి.

Published : 08 Nov 2022 01:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అందమైన సముద్ర తీరాలు, పెద్దపెద్ద సరస్సులు, ఆహ్లాదం పంచే వాతావరణం.. థాయ్‌లాండ్‌ అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఇవి మెదులుతాయి. ప్రపంచ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ఈ దేశం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు బడాబడా వ్యక్తులంతా విశ్రాంతి కోసం ఎక్కువగా ఇక్కడికే వెళ్తుంటారు. థాయ్‌లాండ్‌లో ‘తేలియాడే రైలుకు’ ఎంతో ప్రత్యేకత ఉంది. అలాగని ఇది నీటి మీద తేలుతుందనుకునేరు. పెద్దపెద్ద సరస్సుల మధ్యలోంచి థాయ్‌లాండ్‌ అందాలను వీక్షించేందుకు వీలుగా పసక్‌ జోలాసిడ్‌ వంతెనను ఏర్పాటు చేశారు. దీనిపై రైలు వెళ్తుంటే నీటి మీదనే ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇంకో విశేషమేంటంటే.. థాయ్‌లాండ్‌లో మట్టితో నిర్మించిన వంతెనల్లోకెల్లా ఇదే అతిపొడవైన వంతెనట. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి బయలు దేరితే ఒక రోజు మొత్తం ఈ రైళ్లో తిరగొచ్చు. ఈ వంతెనపై దాదాపు 6 గంటల పాటు ప్రయాణం సాగుతుంది. అన్ని బ్రిడ్జి స్టేషన్లలోనూ దాదాపు 20 నిమిషాల పాటు రైలును ఆపుతారు. అందరూ సరదాగా ఫొటోలు తీసుకునేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది.

రూ.725కే రైలు ఎక్కొచ్చు!

ఈ రైలు నవంబరు- ఫిబ్రవరి మధ్యలో కేవలం వారాంతాల్లో మాత్రమే నడుస్తుంది. డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో మాత్రం నడపరు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల సరస్సులన్నీ నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. దాదాపు పసక్‌ జోలాసిడ్‌ వంతెనను తాకేలా నీటిమట్టం ఉంది. దీంతో ‘తేలియాడే రైలు’ ప్రయాణానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారట. ఇప్పటికే జనవరి వరకు టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు థాయ్‌లాండ్‌ మీడియా వెల్లడించింది. కొవిడ్‌ మహమ్మారితో పర్యాటకం పూర్తిగా స్తంభించిపోవడంతో థాయ్‌లాండ్‌ ఆర్థికంగా బాగా నష్టపోయింది. ఇటీవల పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తుండటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా రైలు ప్రయాణం కూడా ప్రారంభం అవ్వడంతో మరింత మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తోంది. బ్యాంకాక్‌లోని హువాలాంఫాంగ్‌ నుంచి పసక్‌ జోలాసిడ్‌ వంతెన వరకు నాన్‌ ఏసీలో ప్రయాణిస్తే రూ.725, ఏసీ అయితే రూ. 1230 టికెట్‌ వసూలు చేస్తారు. నవంబరు 1 నుంచి టికెట్లు విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఎవరైనా విహారయాత్రకు థాయ్‌లాండ్‌ వెళ్లాలనుకుంటే ఇదో చక్కని అవకాశం..తేలియాడే రైలుపై ప్రయాణించి ప్రత్యేక అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు