China: చైనా కొవిడ్ జీరో వ్యూహం అమలు వెనుక.. ప్రధాన కారణం అదే..!

మాస్‌ టెస్టింగ్, కఠిన లాక్‌డౌన్లు అమలు చేస్తూ కరోనా మీద ఎవరూ చేయని రీతిలో చైనా గట్టి పోరాటం చేస్తోంది.

Published : 18 May 2022 22:01 IST

బీజింగ్: మాస్‌ టెస్టింగ్, కఠిన లాక్‌డౌన్లు అమలు చేస్తూ కరోనా మీద ఎవరూ చేయని రీతిలో చైనా గట్టి పోరాటం చేస్తోంది. అందుకోసం కొవిడ్ జీరో వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చినా, ఇంకా ఈ విధానం సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినా డ్రాగన్ దేశం దీన్నే అమలుచేస్తూ ముందుకెళ్తోంది. 

గత కొద్ది వారాలుగా చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. అక్కడి ప్రముఖ నగరం షాంఘై కఠిన ఆంక్షల చట్రంలోకి వెళ్లి, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. కాగా, తాజా వేవ్‌తో 50 నుంచి 80 ఏళ్ల మధ్యలోనే ఎక్కువ మరణాలు సంభవించాయని అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువమంది టీకా తీసుకోనివారేనని తెలుస్తోంది. అంటే అర్థం వారిలో వైరస్ వల్ల తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి. కొవిడ్ ఉద్ధృతి, వయసు పైబడిన వారిలో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటమూ ఈ కొవిడ్ జీరో విధానాన్ని కఠినంగా అమలు చేయడానికి కారణమని అధికారులు చెబుతున్నారు.

భారీస్థాయిలో వైద్య సదుపాయాలు, విరివిగా స్వదేశీ టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ  చైనాలో తక్కువ వ్యాక్సినేషన్‌ రేటుకు కారణమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ రెండేళ్లలో టీకాల పరంగా ప్రపంచం మొత్తం ప్రమాదం పొంచి ఉన్న వర్గానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ సమయంలో వృద్ధులకు టీకాలు వేసే అవకాశాన్ని చైనా కోల్పోయిందని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఫెంగ్ వాంగ్ వెల్లడించారు. 60ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన 216 మిలియన్ల మంది పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారని చైనీస్ నేషనల్ హెల్త్ ఇటీవల వెల్లడించింది. ఇది ఆ వయస్సువారిలో 82 శాతం మందికి సమానం. అయితే 80 ఏళ్లు పైబడిన వారిని పరిగణనలోకి తీసుకుంటే టీకా పొందిన వారి సంఖ్య తగ్గిపోతోంది. 80ఏళ్లు పైడిన వారిలో మార్చి వరకు 50 శాతం మందికి మాత్రమే టీకా అందింది. అంతేగాకుండా స్వదేశంలో అభివృద్ధి చేసిన టీకా ప్రభావశీలత మిగిలిన వాటితో పోల్చితే తక్కువగా ఉంది. చైనా టీకాలకు సంబంధించి బ్రెజిల్‌లో జరిపిన అధ్యయనంలో తీవ్రమైన వ్యాధిని నివారించడంలో కరోనావాక్‌ టీకా 30 శాతం సామర్థ్యాన్ని మాత్రమే కలిగిఉందని తేలింది. అదే 80ఏళ్లు పైబడిన వారిలో మరణాలను నివారించే విషయంలో 45 శాతం సామర్థాన్ని చూపిందని వెల్లడైంది. ఇక ఆక్స్‌ఫర్డ్ టీకా విషయానికి వస్తే.. దాని ప్రభావశీలత వరుసగా 67 శాతం, 85 శాతంగా ఉంది. 

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ అధ్యయనాలను విస్మరించి, దేశ గౌరవాన్ని పెంపొందించుకోవడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా హాంకాంగ్, షాంఘైలో వృద్ధుల్లో ఎక్కువ మరణాలు సంభవించాయి. ఆ రెండు ప్రాంతాల్లో 80 ఏళ్లు పైబడిన వారిలో వ్యాక్సినేషన్ రేటు అతి స్వల్పంగా ఉంది. ఇదిలా ఉండగా.. చైనా కొవిడ్ జీరో వ్యూహాన్ని పక్కన పెడితే అక్కడ 1.6 మిలియన్ల మరణాలు సంభవించే అవకాశం ఉందని ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చైనా ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. నగదు వోచర్లతో పాటు ఉచిత వంటనూనె, గుడ్లు, పాలు, కిరాణా సామాగ్రిని అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని