Selfie Ban: ఈ అందమైన ప్రదేశంలో ఫొటోలు దిగడం నిషేధం..

ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పోర్టోఫినో పట్టణంలో ఇటీవల సెల్ఫీ నిషేధం అమల్లోకి వచ్చింది. పర్యాటక ప్రదేశాల్లో రద్దీని తగ్గించడం కోసం ఇటీవల ఈ నిషేధం విధించారు.

Updated : 24 Apr 2023 15:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ వేసవిలో ఒకవేళ మీరు ఇటలీ (Italy)లోని పోర్టోఫినో (Portofino) పట్టణానికి విహారయాత్రకు వెళ్లాలనుకుంటే మాత్రం.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే పర్యాటకులు ఒక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లినప్పుడు ప్రముఖ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగాలనుకంటారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి లైకుల కోసం ఎదురుచూస్తారు. ఒకవేళ మీరు పోర్టోఫినో వెళ్లినట్లయితే ఇక్కడి సుందరమైన దృశ్యాల వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగడం కుదరదు. ఈ మేరకు ఆ పట్టణం ఇటీవల నిబంధనలు విధించింది.

ఇటలీలోని సుందరమైన ప్రదేశాలలో పోర్టోఫినో ఒకటి. ఇక్కడి జనాభా కేవలం 500 మాత్రమే. సెలవుల సమయం కావడంతో ప్రస్తుతం ఇక్కడికి వేలమంది పర్యాటకులు వస్తున్నారు. అందమైన ప్రదేశాల్లో సెల్ఫీలు, ఫొటోలు దిగే నెపంతో ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో రద్దీని తగ్గించడం కోసం ఈ పట్టణం ఇటీవల కొన్ని నిబంధనలు విధించింది. పర్యాటకులు ఎవరూ సెల్ఫీలు దిగకుండా నో-వెయిటింగ్‌ జోన్‌ ప్రవేశపెట్టింది. ఒకవేళ నిబంధనలను అతిక్రమించి సెల్ఫీ తీస్తే 275 యూరోల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈస్టర్‌ వారాంతం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 వరకు వర్తిస్తాయి. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు ఈ నియమాలు అమల్లో ఉండే అవకాశం ఉంది.

ఫొటోలు దిగుతూ పర్యాటకులు ఒకేచోట గుమిగూడడం వల్ల వీధుల్లో గంటల తరబడి ట్రాపిక్‌ స్తంభించిపోతోందని పోర్టోఫినో మేయర్‌ మాటియో వయాకావా తెలిపారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంటోందని.. దానికి పర్యాటకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భద్రతా చర్యల దృష్ట్యా సెల్ఫీలపై నిషేధం విధించినట్లు తెలిపారు. అందమైన పర్యాటక ప్రదేశాల్లో సెల్ఫీలపై నిషేధం విధించడం ఇదేం తొలిసారి కాదు. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లోని కొన్ని ప్రదేశాలలోనూ ఇలాంటి నియమాలు అమల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని