Iran: విషప్రయోగాలు చేసిన వారికి మరణ దండన తప్పదు: ఇరాన్‌ సుప్రీం లీడర్‌

ఇరాన్‌(Iran)లో విషప్రయోగాలపై ఆ దేశ సుప్రీం లీడర్‌ ఖమేనీ స్పందించారు. నిందితులకు మరణశిక్ష విధించాలని ఆదేశించారు. 

Published : 08 Mar 2023 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌(Iran) బాలికల పాఠశాలల వద్ద ఉద్దేశపూర్వకంగా విషప్రయోగాలు చోటుచేసుకొంటున్న ఘటనలపై ఆ దేశ సుప్రీం లీడర్‌ అయాతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. అటువంటి నేరాలను ఏమాత్రం క్షమించమని.. నేరస్థులకు మరణశిక్ష ఖాయమని తేల్చి చెప్పారు.  ఇటీవల కాలంలో బాలికలు అస్వస్థతకు గురికావడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోవడంతో ఖమేనీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన జాతీయ టెలివిజన్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. 

‘‘విద్యార్థులపై విషప్రయోగాల ఘటనలపై అధికారులు దర్యాప్తు చేయాలి. ఇవి ఉద్దేశపూర్వకంగా జరిగినవని అని తేలితే సదరు దోషులను ఏమాత్రం క్షమించవద్దు. వారికి మరణదండన విధించండి’’ అని ఆదేశించారు. అధికారుల దర్యాప్తులో అనుమానాస్పద నమూనాలను సేకరించామని ఇరాన్‌ ఇంటీరియర్‌ మంత్రి అహ్మద్‌ వాహిద్‌ పేర్కొన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని పేర్కొన్నారు. 

ఓ పక్క ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా మత నాయకులు వ్యతిరేకత ఎదుర్కొంటున్న సున్నిత సమయంలోనే ఈ విషప్రయోగాలు జరుగుతున్నాయి. దీంతో ఇరాన్‌ పాలకులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. నవంబర్‌ నుంచి ఇరాన్‌లో జరిగిన ఇటువంటి సంఘటనల్లో దాదాపు 1000 మందికి పైగా బాలికలు ఆసుపత్రిపాలయ్యారు. దాదాపు మూడు నెలల నుంచి పలు నగరాల్లో విషప్రయోగాలు జరుగుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. దాదాపు 50కి పైగా  బాలికల పాఠశాలలను లక్ష్యంగా చేసుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు