Kuwait Fire Accident: కువైట్‌ మృతుల్లో ముగ్గురు ఏపీవాసులు

కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు.

Updated : 14 Jun 2024 09:34 IST

చనిపోయినవారిలో 45 మంది భారతీయులను గుర్తించిన అధికారులు

ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శిస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ 

కువైట్‌ సిటీ, దుబాయ్‌: కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. వారిలో ముగ్గురు తెలుగువారు, 24 మంది కేరళవాసులు, ఏడుగురు తమిళనాడుకు చెందినవారు. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది. మరోవైపు మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు వాయు సేన విమానాన్ని సిద్ధంగా ఉంచారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కువైట్‌లోని అల్‌ మంగాఫ్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. అగ్ని ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు బుధవారం రాత్రే కువైట్‌ వెళ్లిన విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వ్యాపారవేత్తలైన లులు గ్రూప్‌ అధినేత యూసుఫ్‌ అలీ రూ.5 లక్షల చొప్పున, రవి పిళ్లై రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు.

తెలుగువారి విషాదం

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- సోంపేట, పెరవలి: కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురున్నట్లు ఏపీ నాన్‌రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం దిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. 

లోకనాథం మంగళవారం రాత్రి కువైట్‌లోని అపార్ట్‌మెంటు వద్దకు చేరుకున్నారు. తెల్లవారితే పనిలో చేరే అవకాశం ఉండగా.. ఈలోపు అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఆయనకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆయన విమాన టికెట్, ఇతర వివరాలతో కంపెనీలో వాకబు చేయడంతో మరణించిన విషయం తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని