Ukraine Crisis: కీవ్‌ పర్యటనలో యూరప్‌ ముఖ్య నేతలు.. ఉక్రెయిన్‌కు సంఘీభావం

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌వాసులకు సంఘీభావం తెలిపేందుకు ఏకకాలంలో నలుగురు కీలక యూరోపియన్‌ నేతలు కీవ్‌కు చేరుకున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌, ఇటలీ ప్రధాని మారియో...

Published : 16 Jun 2022 23:32 IST

కీవ్‌: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌వాసులకు సంఘీభావం తెలిపేందుకు ఏకకాలంలో నలుగురు కీలక యూరోపియన్‌ నేతలు కీవ్‌కు చేరుకున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి గురువారం రైలులో పోలండ్‌ నుంచి ఉక్రెయిన్‌కు చేరుకోగా.. రొమేనియా అధ్యక్షుడు క్లాజ్‌ ఐహోవానిస్‌ సైతం కీవ్‌లో వారికి తోడయ్యారు. రష్యా సైనిక చర్య మొదలైన తర్వాత నాలుగు యూరోపియన్‌ దేశాల ముఖ్య నేతలు ఒకేసారి కీవ్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. అనంతరం వారంతా ఉక్రెయిన్‌వాసులపై రష్యన్‌ సేనల అకృత్యాలకు సాక్ష్యంగా నిలిచిన ఇర్పిన్‌ పట్టణాన్ని సందర్శించారు.

కీవ్‌లోకి చొరబడాలనుకున్న రష్యన్ సైన్యాన్ని ఉక్రెనియన్లు ఇక్కడే అడ్డుకున్నారని మెక్రాన్‌ గుర్తుచేశారు. అక్కడి పౌరులు, సైనికుల వీరత్వాన్ని ప్రశంసించారు. రష్యాను ఉక్రెయిన్ తప్పనిసరిగా ఎదిరించాలని.. ఈ క్రమంలో విజేతగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇదో ముఖ్యమైన క్షణం. మేమంతా ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని ఉక్రెనియన్లకు చేరవేస్తున్నాం’ అని తెలిపారు. రష్యాను ఎదుర్కొనేలా అవసరమైనంత కాలం ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక, మానవతా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జర్మనీ ఛాన్స్‌లర్‌ షోల్జ్ హామీ ఇచ్చారు. ఐరోపా దేశాల సాయంతో ఉక్రెయిన్‌లో ప్రతిదీ పునర్నిర్మిస్తామని ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి భరోసా ఇచ్చారు. అనంతరం వారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు.

సైనిక చర్య మొదట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పదేపదే సంభాషించడం, ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం చేసేందుకు ముందుకు రాకపోవడం వంటి చర్యలతో యూరప్‌లోని కీలక దేశాలుగా ఉన్న ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత పర్యటన యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌కు తాము అండగా ఉన్నామనే సందేశాన్ని చాటేవిధంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు రష్యా దళాలు తూర్పు డాన్‌బాస్ ప్రాంతంలో తమ దాడులను ఉద్ధృతం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ బలగాలపై క్రమంగా పైచేయి సాధిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని