White House: వైట్‌హౌస్‌ ప్రాంగణంలోకి చిన్నారి.. ఆ తర్వాత ఏమైంది?

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ (White House) ఫెన్సింగ్‌ దాటుకుని ఓ చిన్నారి (Toddler) లోనికి ప్రవేశించడం కలకలం రేపింది. ఆ సమయంలో అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) లోపలే ఉండటంతో భద్రతా సిబ్బంది ఎమర్జెన్సీ ప్రకటించి చిన్నారిని గుర్తించారు. 

Updated : 19 Apr 2023 17:33 IST

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే పటిష్ఠమైన భద్రత కలిగిన భవనం.. నిత్యం నిఘా నేత్రాల నీడ.. ఎటు చూసిన భద్రతా సిబ్బంది పహారా.. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ (White House) గురించే ఇదంతా. ఇందులోకి అనుమతిలేనిదే సామాన్యులకు ప్రవేశం ఉండదు. ఇంతటి భద్రత కలిగిన భవన సముదాయంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం మామూలు విషయం కాదు. అలాంటిది, వైట్‌హౌస్‌లోకి ఓ చిన్నారి (Toddler) సునాయాసంగా ప్రవేశించడం కలకలం రేపింది. వైట్‌హౌస్‌ ఉత్తరం వైపు ఫెన్సింగ్ దాటుకుని చిన్నారి లోనికి రావడం భద్రతా వ్యవస్థలు (Security Systems) గుర్తించాయి. చిన్నారి పాకుతూ ఫెన్సింగ్‌ మధ్య నుంచి లోపలికి ప్రవేశించాడని తెలుసుకుని సీక్రెట్ సర్వీస్‌ ఏజెంట్లు (Secret Service Agents) అప్రమత్తమయ్యారు. అనంతరం వైట్‌హౌస్‌లో హై అలెర్ట్‌ ప్రకటించి చిన్నారిని గుర్తించారు. విచారణ జరిపి తల్లిదండ్రులకు అప్పగించారు. 

‘‘ వైట్‌హౌస్‌ ఉత్తరం వైపు నుంచి ఓ అనుకోని అతిథి అధ్యక్ష భవనంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో వైట్‌హౌస్‌ సెక్యూరిటీ వ్యవస్థలు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశాయి. వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించి చిన్నారిని గుర్తించాం. పెన్సిల్వేనియా అవెన్యూ (Pennsylvania Avenue)లో ఉన్న అతడి తల్లిదండ్రులను పిలిపించి.. విచారణ జరిపి చిన్నారిని వారికి అప్పగించాం’’అని వైట్‌హౌస్‌ స్రీకెట్ సర్వీస్‌ అధికార ప్రతినిధి ఆంటోని గుగ్లెల్మీ తెలిపారు. చిన్నారి వైట్‌హౌస్‌లోకి ప్రవేశించిన సమయంలో అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) లోపల ఉన్నారు. దీంతో కాసేపు అధ్యక్ష భవన ప్రాంగణంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వైట్‌హౌస్‌ ఫెన్సింగ్‌ను 13 అడుగుల ఎత్తు, ఫెన్సింగ్‌ల పరిమాణం పెంచిన తర్వాత బయటి వ్యక్తులు లోపలికి ప్రవేశించడం ఇదే తొలిసారని ఆంటోని తెలిపారు. 2014లో బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఓ చిన్నారి వైట్‌హౌస్‌ ఫెన్సింగ్ దాటుకుని లోపలికి ప్రవేశించాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని