Biden: బలపడుతున్న బైడెన్‌పై వ్యతిరేకత.. కమలా హ్యారిస్‌కు పెరుగుతున్న మద్దతు

Biden: అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్‌ వైదొలగాలన్న డిమాండ్లు సొంత పార్టీలోనే ఎక్కువవుతున్నాయి. ఆయన స్థానంలో కమలా హ్యారిస్‌ పోటీ చేయాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Updated : 08 Jul 2024 08:39 IST

Biden | వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై పోటీ నుంచి డెమోక్రాటిక్‌ పార్టీ నామినీ జో బైడెన్ (Joe Biden) వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకీ బలపడుతున్నాయి. తాజాగా సొంత పార్టీలోని కీలక ప్రతినిధులే ఆయన వైదొలగాలని పట్టుబడుతున్నారు. ప్రతినిధుల సభలోని మైనారిటీ నేత హకీం జెఫరీస్‌ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో చాలా మంది బైడెన్‌ (Biden) నిష్క్రమించాలని అభిప్రాయపడ్డట్లు సమాచారం. కొంతమంది ఆయనకు మద్దతుగా నిలిచినవారూ ఉన్నారని తెలుస్తోంది.

ట్రంప్‌తో (Donald Trump) సంవాదంలో బైడెన్‌ తడబడిన తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీంతో దీనిపై ఓ స్పష్టతకు వచ్చేలా కీలక నేతలతో హకీం ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతినిధుల సభలో మళ్లీ మెజారిటీ సాధించాలంటే బైడెన్‌ (Biden) పోటీలో ఉండొద్దని పలువురు కీలక నేతలు అభిప్రాయపడ్డట్లు సమావేశంలో పాల్గొన్న వర్గాలు వెల్లడించాయి. ఆయన వల్ల అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ట్రంప్‌ నుంచి దేశాన్ని రక్షించాలంటే బలమైన నేతను బరిలో నిలపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది.

మోదీ పర్యటనపై పాశ్చాత్య దేశాలకు ఈర్ష్య: రష్యా

బైడెన్‌ (Biden) వైదొలగితే కమలా హ్యారిస్‌ను (Kamala Harris) పోటీలో ఉంచాలని రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో చాలా మంది నేతలు అభిప్రాయపడ్డారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె బరిలో ఉంటే ట్రంప్‌ను ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. చాలా మంది బైడెన్‌ నిష్క్రమణకు పట్టుబట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం జరగనున్న కాకస్‌ సమావేశంలో ఏదో ఒకటి తేలే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. బైడెన్‌కు ఉన్న అనుభవం, ప్రతిష్ఠ నేపథ్యంలో బరి నుంచి దూరం జరిగే ప్రక్రియ సజావుగా సాగితే బాగుంటుందని భావిస్తున్నట్లు వివరించారు.

బైడెన్ మాత్రం తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ తానే అధ్యక్ష అభ్యర్థినని బలంగా చెబుతున్నారు. డెమోక్రాట్లు మొత్తం తన వెంటే ఉన్నట్లు ఉద్ఘాటిస్తున్నారు. మరోవైపు ఆయనకు అత్యంత సన్నిహితుడు, హవాయి గవర్నర్‌ జోష్‌ గ్రీన్‌ శనివారం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పోటీలో ఉండాలా? లేదా? అనే విషయంపై కొన్ని రోజుల్లో బైడెన్‌ తన నిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు. గ్రీన్‌ ఇటీవల బైడెన్‌తో పాటు డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన గవర్నర్లతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన నుంచి ఈ తరహా ప్రకటన వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్‌ భావిస్తే.. ఆ స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను (Kamala Harris) ఆయన ప్రతిపాదించే అవకాశం ఉందని కూడా వెల్లడించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని