Russia: మూడో ప్రపంచయుద్ధం ముప్పు వాస్తవం : హెచ్చరించిన రష్యా

భీకర దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్‌కు అమెరికాతోపాటు ఇతర దేశాలు మద్దతు పలుకుతుండడంతో రష్యా ఘాటుగా స్పందించింది.

Published : 26 Apr 2022 13:59 IST

ఉక్రెయిన్‌కు ఆయుధ సహాయంపై స్పందించిన రష్యా

కీవ్‌: భీకర దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్‌కు అమెరికాతోపాటు ఇతర దేశాలు మద్దతు పలుకుతుండటంతో రష్యా ఘాటుగా స్పందించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందిస్తూ సహాయం చేయడం మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ‘వాస్తవం’ అంటూ హెచ్చరించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో ఆయుధాలను సరఫరా చేసేందుకు అమెరికా దాని మిత్రదేశాలు సిద్ధమవుతోన్న వేళ రష్యా ఈ విధంగా స్పందించింది.

తక్కువ అంచనా వేయొద్దు..

‘మూడో ప్రపంచ యుద్ధం ఎట్టిపరిస్థితుల్లోనూ కోరుకోవడం లేదని ప్రతిఒక్కరూ మంత్రాలు పఠిస్తున్నారు. అవసరమైనప్పుడు కాకుండా కృత్రిమంగా సృష్టిస్తోన్న అణు సంఘర్షణ ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయి. అది వాస్తవం. దానిని మీరు తక్కువగా అంచనా వేయొద్దు’ అని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగించాలని పాశ్చాత్య దేశాలు కోరుకుంటున్నాయన్న ఆయన.. రష్యా సేనలు అలసిపోయినట్లు భావిస్తుండడం కూడా ఒక భ్రమే అన్నారు. రష్యాను ఉక్రెయిన్‌ నాయకులు రెచ్చగొడుతున్నారని, నాటో బలగాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని రష్యా విదేశాంగమంత్రి ఆరోపించారు.

ఓటమిని గ్రహించే..

మూడోప్రపంచ యుద్ధం ముప్పుపై రష్యా విదేశాంగమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఉక్రెయిన్‌ స్పందించింది. ‘ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా ప్రపంచ దేశాలను భయపెట్టాలని చూసిన రష్యా.. చివరకు ఆశలు కోల్పోయింది. అందుకే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వాస్తవం అంటూ బెదిరిస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఉక్రెయిన్‌లో ఓటమిని రష్యా గ్రహించినట్లు అర్థమవుతోంది’ అని ఉక్రెయిన్‌ విదేశాంగమంత్రి దిమిత్రో కులేబా పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, రష్యా సైనికచర్యతో అల్లాడుతోన్న ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు పశ్చిమ దేశాలు ముందుకు వస్తున్నాయి. నేరుగా బలగాలను పంపించేందుకు నిరాకరిస్తున్నప్పటికీ ఆయుధ సామగ్రిని అందిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ, రక్షణశాఖ మంత్రులు కూడా భారీ స్థాయితో ఆయుధ సహకారం అందిస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడంపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ నాటో దేశాలు ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో ఆయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఓవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా మంత్రుల రహస్య భేటీ జరగడం, మరోవైపు రష్యా సరిహద్దు ప్రాంతంలో క్షిపణి దాడులు జరుగుతుండడంతో మూడో ప్రపంచ యుద్ధ ముప్పు అంటూ రష్యా మరిన్ని హెచ్చరికలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని