viral video: జోర్డాన్‌లో విషవాయువు లీక్‌.. 13 మంది మృతి

జోర్డాన్‌లోని ఎర్రసముద్ర తీరంలోని అకాబా పోర్టులో పెను ప్రమాదం సంభవించింది. ఇక్కడ ఒక ట్యాంకర్‌ నుంచి క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌ కావడంతో 13 మంది

Published : 29 Jun 2022 00:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జోర్డాన్‌లోని ఎర్రసముద్ర తీరంలోని అకాబా పోర్టులో పెను ప్రమాదం సంభవించింది. ఇక్కడ ఒక ట్యాంకర్‌ నుంచి క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌ కావడంతో 13 మంది మృతి చెందగా 260 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్లోరిన్‌ను నౌకలో లోడ్‌ చేస్తుండగా అది ఒక్కసారిగా జారిపడి గ్యాస్‌ లీకైంది. దీంతో అక్కడున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. విషవాయువు బారిన పడి పలువురు గాయపడటంతో చికిత్సను అందిస్తున్నట్లు ప్రభుత్వ మీడియా అక్కడ వెల్లడించింది. ప్రభుత్వానికి చెందిన సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగం ప్రత్యేక బృందాలను అక్కడకు తరలించింది. ప్రధాని బిషిర్‌ అల్‌-ఖస్వానెహ్‌ క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై తక్షణం దర్యాప్తు జరపాలని ఇంటీరియర్‌ మినిస్టర్‌ మాజిన్‌ ఫారయాను ఆదేశించారు.  ఈ ట్యాంకర్‌ను క్రేన్‌ సాయంతో నౌకపై లోడు చేస్తుండగా.. ఇనుప తీగతెగి ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. 

సాధారణంగా క్లోరిన్‌ను ఇళ్లల్లో పరికరాలను శుభ్రపర్చడానికి వినియోగిస్తారు. ఇది సాధారణ పరిస్థితుల్లో పసుపు-ఆకుపచ్చ కలిసిన వర్ణంలో ఉంటుంది. దీనిని కంటైనర్లలో నింపి రవాణా చేసే సమయంలో శీతలీకరిస్తారు. క్లోరిన్‌ వాయువును పీల్చినా.. అది శరీరంపై పడినా నీటితో ప్రతిచర్య జరిపి యాసిడ్‌గా మారుతుంది.  ఫలితంగా అక్కడి శరీర కణాలు తీవ్రంగా గాయపడతాయి. ఎక్కువ క్లోరిన్‌ వాయువును పీలిస్తే ఊపిరితిత్తుల్లో ద్రవాలు చేరతాయి. ఇది నిమోనియాకు కారణమై ప్రాణంతకంగా మారవచ్చు. ఈ స్థితిని పల్మనరీ ఎడెమా అంటారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని