US: కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా.. 3 రోజుల్లో 20 మందికి పైగా మృతి

అమెరికా (US)లో మరోసారి తూటాల మోత మోగింది. గంటల వ్వవధిలో వరుసగా జరిగిన కాల్పుల విషాదాల్లో పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 24 Jan 2023 10:36 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా (US)లో తుపాకీ సంస్కృతి పేట్రేగిపోతోంది. కాల్పుల గర్జనకు అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. విచ్చలవిడిగా పెరిగిన తుపాకుల వినియోగంతో కాలు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నానాటికీ పెరుగుతోంది. తాజాగా గంటల వ్యవధిలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో (Shootings) 20 మందికి పైగా బలయ్యారు.

48 గంటల్లో కాలిఫోర్నియాలో రెండుసార్లు..

కాలిఫోర్నియా (California)లోని లాస్‌ ఏంజెలెస్‌ కౌంటీ ప్రాంతంలో గల మాంటెరీ పార్క్‌లో గత శనివారం రాత్రి చైనీయులు లూనార్‌ నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటుండగా ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరగా.. దుండగుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోనే ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్‌ బే ప్రాంతంలో మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

హాఫ్‌మూన్ బేలోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు చోట్ల దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాల్పులపై కాలిఫోర్నియా గవర్నర్‌ గెలివన్‌ న్యూసమ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘విషాదం వెనుక విషాదం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

విద్యార్థులపై పేలిన తూటా..

ఇదే సమయంలో ఐయోవా నగరంలో మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. డెస్‌ మొయినెస్‌ ప్రాంతంలో ఓ ఎడ్యుకేషనల్ మెంటార్‌షిప్‌ ప్రోగ్రామ్‌ జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతులిద్దరూ 18, 16 ఏళ్ల వయసువారే. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇక షికాగోలో తెలుగు విద్యార్థులపై నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో ఓ హైదరాబాదీ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు స్థానికంగా ఉన్న షాపింగ్‌మాల్‌కు వెళ్తుండగా.. కొందరు వారిని వెంబడించి దోపిడీకి పాల్పడ్డారు. వెళ్తూవెళ్తూ వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలోహైదరాబాద్‌కు చెందిన నందపు దేవ్‌శిష్‌ అనే విద్యార్థి మృతిచెందగా.. కొప్పాల సాయి చరణ్‌ అనే యువకుడు గాయాలపాలయ్యారు.

23 రోజుల్లో 36 ఘటనలు..

అమెరికా (America)లో తుపాకీ వినియోగం (Gun Culture) పెచ్చుమీరుతుందని చెప్పేందుకు ఈ ఘటనలే నిదర్శనం. ఓవైపు తుపాకీ నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. కాల్పుల ఘటనలు మరింత పెరుగుతున్నాయి. ఈ ఏడాది తొలి 23 రోజుల్లో 36 ఘటనలు జరిగాయంటే తుపాకీ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే.. సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కువ ఘటనలు చోటుచేసుకున్నాయి.

గతేడాది అమెరికా వ్యాప్తంగా 647 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్కో షూటర్‌ చేతిలో కనీసం నలుగురు వ్యక్తులు గాయపడటం లేదా ప్రాణాలు కోల్పోయారు. ఇక 2022లో మొత్తంగా దాదాపు 44వేల మంది తుపాకీ గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో సగానికి పైగా తుపాకులతో ఆత్మహత్యలు చేసుకున్నవారే అని అగ్రరాజ్య అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు