Ukraine Crisis: యుద్ధంతో నలిగిపోతోన్న ప్రజలు.. కంటతడి పెట్టిస్తోన్న దృశ్యాలు..!

ఎక్కడైనా యుద్ధం, ఘర్షణలు, అనూహ్య పరిస్థితులు ఎదురైనప్పుడు మధ్యలో నలిగిపోయేది, నష్టపోయేది సాధారణ ప్రజలే. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యాకు మధ్య జరుగుతోన్న సైనిక పోరులో కూడా అలాంటి దృశ్యాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

Published : 26 Feb 2022 01:48 IST

కీవ్‌: ఎక్కడైనా యుద్ధం, ఘర్షణలు, అనూహ్య పరిస్థితులు ఎదురైనప్పుడు మధ్యలో నలిగిపోయేది, నష్టపోయేది సాధారణ ప్రజలే. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యాకు మధ్య జరుగుతోన్న సైనిక పోరులో కూడా అలాంటి దృశ్యాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు కుటుంబానికి ఏం కాకూడదని, మరోవైపు ఈ క్లిష్ట సమయంలో తన దేశానికి అండగా నిలవాలని ఓ వ్యక్తి పడుతున్న తాపత్రయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో తన చిన్నారి కూతుర్ని వీడలేక అతడు కన్నీరు పెట్టిన తీరు కలచివేస్తోంది. 

గురువారం ఉదయం సైనిక చర్యకు దిగిన రష్యా.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ నగరంవైపు దూసుకువస్తోంది. ఆ దేశ సైనిక స్థావరాలను కూల్చివేస్తూ, ఎదురునిల్చిన సైనికుల్ని హతమారుస్తూ ముందుకెళ్తోంది. ఈ పరిస్థితుల్లో ఎంతోమంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అలాగే కీవ్‌ నగరంలో ఓ తండ్రి.. తన కూతుర్ని సురక్షిత ప్రాంతానికి పంపిస్తూ, కన్నీరు పెడుతున్న దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పౌరులను దాడులకు దూరంగా క్షేమంగా ఉండే ప్రాంతానికి తరలించేందుకు ఓ బస్సు సిద్ధంగా ఉంది. అందులోకి ఎక్కించేముందు ఆ తండ్రి తన కన్నబిడ్డను ఆప్యాయంగా తడుముకున్నాడు. దగ్గరకు తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. అప్పటికీ ఎంత నిబాయించుకున్నా.. బస్సు ఎక్కించే ముందు మాత్రం ఇక తట్టుకోలేకపోయాడు. కుమార్తెను గట్టిగా అదుముకొని వెక్కివెక్కి ఏడ్చాడు. ఆ బిడ్డ పరిస్థితీ అదే.  తండ్రిని వీడలేక, ఏడ్చుకుంటూనే బస్సులో కూర్చుండిపోయింది. ఆ నాన్న మాత్రం ఉక్రెయిన్‌కు సహరించేందుకు అక్కడే ఉండిపోయాడు. 

ఇదే తరహాలో మరో హృదయ విదారక వీడియో ఒకటి మెలిపెడుతోంది. రష్యా కురిపిస్తోన్న బాంబుల వర్షంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఓ సైనికుడు విడుదల చేసిన వీడియో అది. తిరిగి తన తల్లిదండ్రుల్ని చూసుకోగలనో లేదో అని అతడు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. ‘మేమున్న ప్రాంతం బాంబులతో దద్దరిల్లుతోంది. అమ్మా.. నాన్న.. ఐ లవ్‌ యూ’ అంటూ ఈ వీడియోలో నిస్సహాయంగా మాట్లాడుతూ కనిపించాడు. 





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని