Published : 24 Jun 2022 01:43 IST

Sri Lanka: బంకుల వద్ద రోజుల తరబడి ‘క్యూ’.. పిట్టల్లా రాలుతోన్న ప్రజలు..!

ఇంధనం కోసం నిలబడి ఇప్పటివరకు 10 మంది మృత్యువాత

కొలంబో: శ్రీలంకలో నెలకొన్న ఇంధన (Fuel Crisis), ఆర్థిక, ఆహార సంక్షోభాలు అక్కడి ప్రజలకు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ముఖ్యంగా ఇంధనం కోసం బంకుల ముందు రోజుల తరబడి ‘క్యూ’లోనే వేచిచూడాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలా నిరీక్షిస్తూ ‘క్యూ’లోనే తనువు చాలిస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఐదురోజుల పాటు క్యూలో ఉండి చివరకు ప్రాణాలు కోల్పోయినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. ఇలా ఇంధనం కోసం వేచిచూస్తూ మరణించిన వారిసంఖ్య పదికి చేరడం శ్రీలంక సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

వాహనంలో ఇంధనం నింపుకునేందుకు ఓ 63ఏళ్ల వృద్ధుడు అంగురువటోటలోని పెట్రోల్‌ బంకు వద్ద వేచిచూస్తున్నాడు. అలా ఐదురోజులు అయినప్పటికీ ఇంధనాన్ని నింపుకోలేకపోయాడు. చివరకు తన వాహనంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఇంధనం కోసం క్యూలో వేచిచూస్తూ మరణించడం ఇదో పదో సంఘటన అని పేర్కొన్నారు. చనిపోయిన వాళ్లందరూ 43 నుంచి 84ఏళ్ల మధ్య వయసున్న వారే. వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోతున్నట్లు శ్రీలంక మీడియా వెల్లడించింది. రాజధాని కొలంబోలోని పానాదుర ప్రాంతంలో ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద క్యూలో నిలబడిన ఓ 53ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తన ఆటో రిక్షాలో ఇంధనం కోసం గంటల తరబడి లైన్లో నిలబడడం వల్లే ఆయన చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఇలా తీవ్ర ఇంధన కొరత ఎదుర్కొంటున్న శ్రీలంక.. పౌరుల నుంచి వస్తోన్న ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు, పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తోంది. ముఖ్యంగా రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోన్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో జూన్‌ 17 నుంచి శుక్రవారాన్ని కూడా సెలవుదినంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే మూడు నెలలపాటు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. అయితే, ఈ సెలవు రోజుల్లో వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొని ఆహార ఉత్పత్తులను పెంచేందుకు కృషి చేయాలని వారికి పిలుపునిచ్చింది. మరోవైపు ఇంధన కొరత వల్ల కేవలం 20శాతం సర్వీసులను మాత్రమే నడుపుతున్నట్లు ప్రైవేటు ఆపరేటర్లు కూడా చెబుతున్నారు.

పెట్రోల్‌ బంకులతోపాటు నిత్యావసర వస్తువుల కోసం గంటలు, రోజుల తరబడి నిలబడడంపై శ్రీలంక వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటువంటి సమయంలో ప్రజల ఆగ్రహాన్ని అంచనా వేసి భద్రతా చర్యలు ముమ్మరం చేయాలని  విదేశీ రాయబారులు శ్రీలంక ప్రభుత్వానికి సూచించారు. క్యూలో నిలబడిన పౌరులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలను తీవ్రమైనవిగా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ఇంధన కొరత మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నందున వీటి పంపిణీపై పరిమితి విధించేందుకూ శ్రీలంక ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని