Trump: ట్రంప్‌పై తిరుగుబాటు ఆరోపణలు..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తిరుగుబాటుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ విచారణ చేపట్టింది. విచారణ కమిటీకి రిపబ్లికన్‌ పార్టీకి చెందిన లిజ్‌ ఛెనీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు

Updated : 10 Jun 2022 15:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తిరుగుబాటుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ విచారణ చేపట్టింది. విచారణ కమిటీకి రిపబ్లికన్‌ పార్టీకి చెందిన లిజ్‌ ఛెనీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ ‘దాడికి కారణమైన ఆగ్రహ జ్వాలను ట్రంప్‌ ఎగదోశారు’ అని పేర్కొన్నారు. డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడు బెన్నీ థాంప్సన్‌ మాట్లాడుతూ ట్రంప్‌ అమెరికా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు.

గతేడాది 2021 జనవరి 6న జోబైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు అమెరికా చట్ట సభ సభ్యులు క్యాపిటల్‌ హిల్‌ భవనంలో సమావేశం అయ్యారు. అదే సమయంలో ట్రంప్‌ మద్దతు దారులు ఈ భవనంలోకి దూసుకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం ఏడాది పాటు దర్యాప్తు నిర్వహించింది. ట్రంప్‌ సన్నిహితులతో నిర్వహించిన ఇంటర్వ్యూక్లిప్‌లను గురువారం సాయంత్రం నుంచి డెమొక్రాట్లు నేతృత్వం వహిస్తున్న ప్రతినిధుల సభ సెలక్ట్‌ కమిటీ ప్రదర్శిస్తోంది.

ఆ ఫుటేజీల్లో.. అమెరికా మాజీ అటార్ని జనరల్‌ బిల్‌బార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయారాని, ఫలితాలను అపహరించారనే మాటలు అవాస్తవాలని పదేపదే నాటి అధ్యక్షుడు ట్రంప్‌ను వారించానన్నారు.

ట్రంపు వాదిస్తోన్న కుట్ర కోణాన్ని బిల్‌బార్‌ తోసి పుచ్చడాన్ని తాను కూడా అంగీకరిస్తున్నానని డొనాల్డ్‌ ట్రంప్ కుమార్తె ఇవాంక కూడా పేర్కొన్న దృశ్యాలు కాంగ్రెస్‌ వద్ద ఉన్న ఫుటేజీల్లో ఉన్నాయి. మరోపక్క ఈ విచారణలు మొత్తం రాజకీయ బూటకమని ట్రంప్‌ కొట్టిపారేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని