Elon Musk-Trump: అప్పుడు.. మస్క్‌ను మోకాళ్లపై నిలబడి అడుక్కోమనాల్సింది: ట్రంప్‌

అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ట్రంప్‌ రాజకీయాలకు స్వస్తి పలికి

Published : 15 Jul 2022 02:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ట్రంప్‌ రాజకీయాలకు స్వస్తి పలికి తన శేష జీవితాన్ని హాయిగా గడపాలంటూ ఇటీవల మస్క్‌ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన ట్రంప్‌.. మస్క్‌పై గట్టిగానే విరుచుకుపడ్డారు. గతంలో మస్క్‌ తన వద్దకు సాయానికి వచ్చినప్పుడు.. మోకాళ్లపై నిలబడి అడుక్కోమని చెప్పినా అతడు కచ్చితంగా చేసేవాడని ఎద్దేవా చేశారు.

అసలేం జరిగిందంటే..

ట్విటర్‌ (Twitter) కొనుగోలు ఒప్పందం నుంచి ఎలాన్‌ మస్క్‌ తప్పుకోవడంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల అలస్కాలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేయబోరని తాను ముందే చెప్పానంటూ విమర్శించారు. దీనికి మస్క్ దీటుగా బదులిచ్చారు. ట్రంప్‌ వయసు పెరిగిపోతోందని, ఇకనైనా క్రియాశీల రాజకీయాలకు స్వస్తి పలికి తన శేష జీవితాన్ని హాయిగా గడపాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మరి ట్రంప్‌ ఊరుకుంటారా..? మస్క్‌ విమర్శలకు అంతే స్థాయిలో బదులిచ్చారు. ‘‘నేను అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో ఉన్నప్పుడు ఎలాన్‌ మస్క్‌ వచ్చి తన అనుబంధ ప్రాజెక్టులకు నన్ను సాయం అడిగారు. తన ఎలక్ట్రిక్ కార్లు ఎంతో దూరం వెళ్లకపోయినా.. డ్రైవర్‌ రహిత కార్లు ప్రమాదాలకు గురవుతున్నా.. వాటికి సాయం చేయమని కోరారు. అంతేనా తాను ట్రంప్‌నకు, రిపబ్లికన్‌ పార్టీకి పెద్ద అభిమానినంటూ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నేను అతడిని మోకాళ్లపై కూర్చుని అడుక్కోమని చెప్పాల్సింది. అలా చెప్పినా అతడు చేసేవాడే..’’ అంటూ తన సోషల్‌మీడియా వేదిక ట్రూత్‌లో వరుస పోస్టుల్లో రాసుకొచ్చారు. మస్క్‌ ఇకనైనా, ఇవన్నీ పక్కనబెట్టి తన ట్విటర్‌ దావాపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా వైట్‌హౌజ్‌లో వీరిద్దరూ దిగిన ఫొటోను కూడా ట్రంప్‌ షేర్‌ చేశారు.

కాగా.. ట్రంప్‌ తాజా విమర్శలకు మస్క్‌ తనదైన శైలిలో బదులిచ్చారు. ట్రంప్‌ పోస్ట్‌ను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. దానికి స్పందించిన మస్క్ కార్టూన్‌ క్యారెక్టర్‌ గ్రాండ్‌పా సిమ్సన్‌ అరుస్తున్నట్లుగా ఉన్న జిఫ్‌ ఇమేజ్‌ను పోస్ట్‌ చేస్తూ మాజీ అధ్యక్షుడికి వ్యంగ్యంగా కౌంటర్‌ ఇచ్చారు.

ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తానెప్పుడూ రిపబ్లికన్‌ పార్టీకి ఓటేయ్యలేదని అన్నారు. దీనిపై ట్రంప్ అలస్కా సమావేశంలో స్పందించారు. మస్క్‌ తనకు ఓటేసిన విషయాన్ని గతంలో ఆయనే స్వయంగా తనకు చెప్పారని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని