Elon Musk - Trump: ట్రంప్‌.. ఇక తప్పుకుంటే మంచిది: ఎలాన్‌ మస్క్‌

Elon Musk - Trump: ట్రంప్‌ ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని ఎలాన్‌ మస్క్‌ సూచించారు...

Updated : 12 Jul 2022 14:13 IST

వాషింగ్టన్‌: టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Musk), అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ట్విటర్‌ కొనుగోలు ఒప్పందంపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు.. ట్రంప్‌ (Trump) ఇంకా రాజకీయాల్లో కొనసాగడంపై మస్క్‌ (Musk) తాజాగా చేసిన కామెంట్స్‌ చూస్తే ఇది స్పష్టమవుతోంది. ట్రంప్‌ ఇక క్రియాశీల రాజకీయాలకు స్వస్తి పలికి శేష జీవితాన్ని హాయిగా గడపాలని మస్క్‌ సూచించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అధ్యక్షుడు బైడెన్ పదవీకాలం ముగిసేనాటికి ట్రంప్‌ వయస్సు 82 ఏళ్లవుతుందని మస్క్‌ మంగళవారం చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. అమెరికా సహా దేనికైనా సీఈఓగా వ్యవహరించడానికి ఆ వయసు చాలా ఎక్కువని వ్యాఖ్యానించారు. ట్రంప్‌పై తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. కానీ, రాజకీయాలకు స్వస్తి పలికి హాయిగా గడపాలని ‘‘hang up his hat & sail into the sunset’’ అనే ఆంగ్ల జాతీయం ద్వారా పరోక్షంగా సూచించారు. డెమోక్రటిక్‌ పార్టీవారు సైతం ట్రంప్‌పై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. అధ్యక్ష పదవిని చేపట్టడం తప్ప ట్రంప్‌నకు మరో మార్గం లేదన్న భావన ఆయనలో కలిగించొద్దన్నారు.

ఇలా ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని మస్క్‌ బహిరంగంగా సూచించడం ఇదే తొలిసారి. గత నెల ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను ఎవరికి మద్దతు ఇవ్వాలో..? వద్దో..? తేల్చుకోలేకపోతున్నానన్నారు. ఫ్లోరిడా గవర్నర్‌గా ఉన్న డీశాంటిస్‌ అయితే బైడెన్‌పై సునాయాసంగా విజయం సాధిస్తారని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రచారం కూడా చేయాల్సిన అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. 

గత శనివారం అలస్కాలో జరిగిన ఓ కార్యక్రమంలో మస్క్‌పై ట్రంప్‌ పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మస్క్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటి వరకు తానెప్పుడూ రిపబ్లికన్‌ పార్టీకి ఓటు వేయలేదని మస్క్‌ ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. దాన్ని ప్రస్తావించిన ట్రంప్‌.. మస్క్‌ తనతో తనకే ఓటేసినట్లు గతంలో ఓసారి చెప్పారన్నారు. ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ట్విటర్‌ డీల్‌ నుంచి మస్క్‌ వెనక్కి తగ్గడంపైనా ట్రంప్‌ విమర్శలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని