Trump: ప్రైవేట్ పార్టీలో దేశ రహస్యాలను లీక్ చేసిన ట్రంప్!
Trump: దేశ భద్రత, సైనిక రహస్యాలను ట్రంప్ ప్రైవేటు వ్యక్తులకు తెలియజేసినట్లు నేరాభియోగాల్లో పేర్కొన్నారు. పైగా తీసుకెళ్లిన వేలాది రహస్య పత్రాల్లో కొన్నింటిని చిందరవందరగా పడేసినట్లు వెల్లడించారు.
మయామీ: రహస్య పత్రాల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)పై నమోదైన నేరాభియోగాల్లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన తన సొంత నివాసానికి దేశ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను తరలించుకుపోయారని అభియోగాల్లో అధికారులు వెల్లడించారు.
దేశ భద్రత, సైనిక రహస్యాలు..
ట్రంప్ (Trump) తీసుకెళ్లిన రహస్య పత్రాల్లో అమెరికా అణు కార్యక్రమ ప్రణాళికలు, అమెరికా సహా మిత్రదేశాలకు పొంచి ఉన్న సైనిక ముప్పు, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రచించిన ప్రణాళికల వంటి కీలక వివరాలు ఉన్నట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థకు ఓ దేశం మద్దతిస్తున్నట్లు ఉన్న ఆధారాలను సైతం ట్రంప్ తీసుకెళ్లిన రహస్య పత్రాల్లో ఉన్నాయని సమాచారం. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సహా ఇతర నిఘా సంస్థల నుంచి అందిన అనేక పత్రాలు అందులో ఉన్నట్లు అభియోగాల్లో ఉంది.
గోల్ఫ్ క్లబ్‌లో ప్రైవేట్ వ్యక్తులతో..
ఇరాన్‌పై దాడికి సంబంధించిన అత్యంత రహస్యమైన ప్రణాళికలను 2021 జూన్‌లో ట్రంప్ న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన ప్రైవేట్ పార్టీకి హాజరైన అతిథులతో షేర్ చేసుకున్నారని నేరాభియోగాల్లో పేర్కొన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమనీ.. దీన్ని అత్యంత రహస్య సమాచారం కింద వర్గీకరించామని కూడా ఆయన అందరి ముందూ అంగీకరించినట్లు వెల్లడించారు. మరో సందర్భంలో 2021 సెప్టెంబరులో అమెరికా మిలిటరీకి చెందిన ఓ కీలక మ్యాప్‌ను ట్రంప్ (Trump) తన పొలిటికల్ యాక్షన్ కమిటీలోని ఓ అనధీకృత వ్యక్తితో పంచుకున్నట్లు తెలిపారు. అలాంటి సమాచారం తెలుసుకునే అర్హత సదరు వ్యక్తికి లేదని.. పైగా అతడికి సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా లేదని అభియోగాల్లో వెల్లడించారు.
చివరికి బాత్‌రూమ్‌లో కూడా..
ఫ్లోరిడాలో ట్రంప్ (Trump)నకు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో దాదాపు 13,000 పత్రాలు లభించినట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. వీటిలో దాదాపు 300 పత్రాలు అత్యంత రహస్యమైనవని తేల్చారు. వీటన్నింటినీ ట్రంప్ ఎస్టేట్‌లోని బాల్‌రూమ్, బాత్‌రూమ్, ఓ కార్యాలయం, బెడ్‌రూంలో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ట్రంప్ లాయర్లు మాత్రం వాటిని కేవలం స్టోరూమ్‌లలో మాత్రమే భద్రపరిచామని తెలిపారు. బ్యాంకర్ బాక్సుల వంటి వాటిలో వీటిని దాచిపెట్టినట్లు.. వాటికి సంబంధించిన ఫొటోలను అధికారులు నేరాభియోగాల్లో ఫైల్ చేశారు. అయితే, కొన్ని కీలక పత్రాలు చిందరవందరగా కూడా పడి ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ట్రంప్ వ్యక్తిగత సహాయకులు కుట్రపూరితంగానే వీటిని తరలించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని వెల్లడించారు. అయితే, ఇంతటి రహస్య పత్రాలను తరలించడంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని తెలిపారు. కొన్ని పత్రాలు నేలపై చిందరవందరగా పడి ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిలో సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్న అమెరికా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది ఎంపిక చేసిన ఉన్నతాధికారులు మాత్రమే చూసేందుకు అనుమతి ఉన్న పత్రాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
ఆధారాలివే..
ట్రంప్ (Trump) వివిధ అధికారులతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌లను విచారణాధికారులు సంపాదించారు. అలాగే ట్రంప్ ఎస్టేట్‌లో దొరికిన పత్రాలకు సంబంధించిన పెట్టెల ఫొటోలను కూడా కోర్టుకు సమర్పించారు. అలాగే ట్రంప్ సిబ్బంది మధ్య నడిచిన మెసేజ్‌లను కూడా అభియోగాల్లో ఫైల్ చేశారు. ‘ ఆ బాక్సులను ఎవరూ చూడొద్దు.. వీలైతే వారికి అసలు అక్కడ ఏమీ లేవని చెబితే మేలు’ అని ట్రంప్ తన లాయర్లతో చెబుతున్నట్లు ఉన్న ఆడియో క్లిప్పింగ్ కూడా లభించినట్లు సమాచారం.
రహస్య పత్రాల కేసులో శుక్రవారం ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. అమెరికా చరిత్రలో ఇలా ఫెడరల్ ప్రభుత్వ అభియోగాలు నమోదైన తొలి మాజీ అధ్యక్షుడు ఈయనే. నేరాభియోగాల దాఖలు విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఈ కేసులో మంగళవారం (జూన్ 13) మయామిలోని ఫెడరల్ కోర్టు హౌజ్‌లో హాజరు కావాల్సిందిగా తనకు సమన్లు అందినట్లు తెలిపారు. ఇందులో ట్రంప్ దోషిగా తేలితే దీర్ఘకాలంపాటు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో అశ్లీల చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపుల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Andhra news: గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుబట్టిన కాగ్
-
Monsoon: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం: ఐఎండీ
-
Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లు.. సిఫార్సులు తిరస్కరించిన తమిళిసై
-
LIC Dhan Vriddhi: ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం ప్లాన్ నెలాఖరు వరకే
-
Parineeti-Raghav: పరిణీతి పెళ్లికి రాలేకపోయిన ప్రియాంక చోప్రా.. అసలు కారణమిదే
-
Modi: కాంగ్రెస్.. ఇప్పుడు తుప్పుపట్టిన ఇనుము: మోదీ తీవ్ర విమర్శలు